రెండోరోజూ కొనసాగిన ఫాతిమా విద్యార్థుల ఆందోళన

పలుఉవరు మద్దతు..ఎంసిఐకి లేఖ రాయాలని సూచన

విజయవాడ,నవంబర్‌1(జ‌నంసాక్షి): గుర్తింపు రద్దుతో రోడ్డున పడ్డ కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన రెండోరోజుకు చేరింది. వీరు విజయవాడ ధర్నా చౌక్‌లో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఫాతిమా కాలేజీ వివాదంపై కేంద్రంతో కలిసి సుప్రీం కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఇప్పటికే చెప్పారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫాతిమా కాలేజీ విద్యార్థులు చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. అడ్మిషన్‌ ఇవ్వడానికి కేంద్రం, ఎంసీఐ ఒప్పుకోకపోవడంతో ఫాతిమా కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు. విజయవాడలో ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనకు దిగారు. వారికి విపక్షాలు మద్దతు పలికాయి. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీంతో ధర్నా చౌక్‌కు వచ్చిన పలువురు వారిని పరామర్శిస్తున్నారు. ఇదిలావుంటే ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ)తో చర్చించాలని పలువురు ప్రముఖులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఎంసిఐకి లేఖ రాస్తామని చెప్పారు. ఫాతిమా వైద్య విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ తమ మద్దతు ఉంటుందని హావిూ ఇచ్చారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి వస్తుందంటూ విద్యార్థులను యాజమాన్యం మభ్యపెట్టడంతో పాటు, ఇటీవల సుప్రీం కోర్టులో వారికి ప్రతికూల తీర్పు రావడంతో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముందని తెలిపారు. బంగారు భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని, వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అడ్మిషన్‌లు జరిగి ఏడు నెలలు తరగతులు నిర్వహించిన తర్వాత పరీక్షలకు ముందు ఎంసిఐ అనుమతిలేదని చెప్పడం, అనంతర పరిణామాలు విద్యార్థులు భవిష్యత్తును అయోమయానికి గురి చేశాయన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

తాజావార్తలు