రేపు అందరం ఒకే రోజున సీత్లా పండుగను జరుపుకుందాం జాతి ఐక్యతను చాటుదాం. – జాతీయ బంజారా మిషన్ (ఇండియా) జిల్లా అధ్యక్షుడు బానోతు రమేష్ నాయక్

డోర్నకల్ /కురవి, జులై/9/జనం సాక్షి న్యూస్:
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బంజర మిషన్ ఇండియా జిల్లా అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల కట్టు బొట్టు,వేషధారణ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు అతి పవిత్రంగా ఉంటాయి. ప్రకృతిని పూజించడం,ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకత.అలాగే పండుగ సందర్భాల్లో పశువులను అలంకరించడం గిరిజన జాతి పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తుంది.ప్రతి సంవత్సరం పెద్ద పుసల కార్తె మొదటి లేదా రెండో మంగళవారం గిరిజన జాతి శోభ ఉట్టిపడేలా సీత్ల పండుగను జరుపుకోవడం ఆనవాయితి. అయితే అలాకాకుండా మొదటి మంగళవారం ఈ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఒకే సారి రేపు మంగళవారం జరుపుకోవాలని జాతీయ బంజారా మిషన్ (ఇండియా) మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు బానోతు రమేష్ నాయక్ అన్నారు. గత 5 సంవత్సరాలుగా సేవాలాల్ సేన, గిరిజన సంఘం, లంబాడి ఐక్యవేదిక, జాతీయ బంజారా మిషన్ (ఇండియా) గిరిజన సంఘాల కలిసి గిరిజన మత పెద్దలు,విద్యావంతులు వివిధ ప్రసార విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే గిరిజనులకు తాము జరుపుకునే పండగల్లో మొదటి పండుగా సీత్ల పండుగ కావడం విశేషం.
పండుగ కదాంశం: పూర్వం గిరిజనులు ఎక్కువ సంఖ్యలో పశుసంపదను కలిగి ఉండి వ్యవసాయమే జీవన ఆధారంగా జీవించే వారు. అందుకే వారు పశువులను ఊరికి పచ్చగా ఉండే దూర ప్రాంతాలకు మేకలను, గొర్రెలను తీసుకెళ్లి ఆయా ప్రాంతాలలో గూడెం లను ఏర్పాటు చేసుకొని జీవనం సాగించే వారు.వాతావరణంలో వచ్చిన భారీ మార్పుల వల్ల పచ్చగా ఉండాల్సిన ప్రాంతాలు ఒక్కసారిగా మార్పు సంతరించుకోవడంతో పశుసంపదకు వివిధ రోగాలు వచ్చేవి.ఇలా రోగాల బారిన పడి పశుసంపద రోజురోజుకీ తగ్గిపోవడంతో తండా వాసులు తల్లడిల్లిపోతున్న నేపథ్యంలో ఒక రోజు రాత్రి తండా పెద్ద కు ఏడుగురు దేవతలు కలలోకి వచ్చారు. ఆ ఏడుగురి దేవతలలో చిన్నదైనా సీత్ల భవాని ప్రత్యేకంగా కలలో కి వచ్చి తనను ప్రత్యేకించి పూజించి జంతు బలి చేస్తే రోగాల బారిన పడి చనిపోతున్న పశుసంపదను కాపాడుతానని చెప్పి అదృశ్యమయ్యింది.మరునాడు ఆ తండా పెద్ద తండాలోని ప్రజలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి తన కలలో వచ్చి సీత్ల భవాని వచ్చి చెప్పిన వృత్తాoతాన్ని ప్రజలకు వివరించారు.ఈ విధంగా సీత్ల పండుగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
సప్త మాతృకల ఆరాధనే సీత్ల పండుగా
వివిధ రోగాల బారినపడి చనిపోతున్న పశుసంపదను కాపాడాలని కోరుతూ గిరిజనులు సప్త మాతృకలు అయిన (ఏడుగురు దేవతలు) మేరామా,తొల్జా,మంత్రాల్, కంకాళీ, హింగ్లా,ద్వాళ్లాగర్,సీత్లా భవానిలను(దేవతలను)పూజించుటయే సీత్ల పండుగ.
సీత్ల పండగ విధానం
పునర్వసు కార్తెలో మొదటి లేదా రెండవ మంగళవారం జరుపుకునే ఈ పండుగా గిరిజనుల ఇండ్ల లో కాకుండా తండాకు సమీపంలో ఓ ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మందిరంలో ఏడుగురు దేవతా మూర్తుల విగ్రహాలను (రాళ్లను)ఎత్తుల వారిగా ఒక వరుస క్రమంలో పేరుస్తారు. దేవతా విగ్రహాలకు ఎదురుగా లుంకడియా విగ్రహాన్ని ఏడుగురు దేవతల వైపు చూసే విధంగా ఏర్పాటు చేస్తారు.
కన్నెపిల్లలచే దేవతలకు నైవేద్యం
సీత్ల భవాని విగ్రహాలకు జాజి రంగు పూసి మామిడి తోరణాలను దేవతా మూర్తుల చుట్టూ కట్టి అందంగా అలంకరిస్తారు.పండుగకు ఒకరోజు ముందు జొన్నలు, పప్పుధాన్యాలు నానబెట్టి మరుసటి రోజు పండుగ రోజు వండుతారు. దీనిని ఘుగ్రీ అని,వాసిడో అని అంటారు. వండిన ఆ పదార్ధాన్ని ముందుగా పెళ్లికాని యువతుల చేత దేవతలకు నైవేద్యంగా చెల్లిస్తారు.అనంతరం గిరిజన యువతి యువకులు, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున మేళతాళాలతో గిరిజన వేషధారణలతో దేవాలయానికి గొర్రెపోతులను దేవతలకు బలి ఇవ్వడం కోసం తీసుకొస్తారు.సీత్ల మాతలకు గిరిజనులు వారివారి ఇంటి వండుకొని తీసుకొచ్చిన లాప్షి (పాయసం)ని పూజలో ఉంచి గొర్రె పోతులపై నీళ్లు పోసి జడిపి ఇప్పిస్తారు. అనంతరం ఆ గొర్రెపోతులను భవానీల ముందు బలి ఇస్తారు.బలి అనంతరం గొర్రెపోతుల పొట్టలోని పేగులను బయటకు తీసిఏడుగురు భవానీల ప్రతిమల నుంచి లుంకడియా ప్రతిమ వరకు నేలపై పరుస్తారు.అనంతరం యువతులు చెంబులలోతెచ్చిన నీటితో ఏడుగురు ప్రతిమల తో పాటు లుం కడియా ప్రతిమను కూడా జలాభిషేకం చేస్తారు.అనంతరం గొర్రెపోతుల పొట్ట పేగులను ప్రతిమల ముందు పేరుస్తారు. ఆపేగుల పైనుండి పశువులు, గొర్రెలు, మేకలను దాటిస్తారు. ఇలా దాటించడం వలన ఈ పండుగకు దాటుడు పండుగా అని పేరువచ్చింది.ఇలా చేయడం వల్ల పశు సంపదకు ఎలాంటి రోగాలు రాకుండా ఈ ఏడుగురు దేవతలు కాపాడుతాయని గిరిజన ప్రజల ప్రగాఢ విశ్వాసము.ఈ కార్యక్రమంలో ఎన్బిఎంఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు