రేవంత్‌ తన సమస్యలను బాబుతో పరిష్కరించుకోవాలి

బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి: చినారజప్ప

ఏలూరు,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): రేవంత్‌ రెడ్డికి ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో మాట్లాడి పరిష్కరించుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రేవంత్‌రెడ్డి ఒక పార్టీలో ఎదిగి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉంటూ మా మంత్రులపై బురద జల్లి వెళ్లిపోతాననడం సరికాదని సూచించారు. కార్తీక సోమవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామాన్ని ఆయన సోమవారం దర్శించుకున్నారు. కాగా సోమవారం ఉదయం పంచారామ ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగత పలికారు. చినరాజప్ప ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడుతూ రేవంత్‌ అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. రేవంత్‌రెడ్డికి పార్టీతో ఇబ్బందులు ఉంటే చంద్రబాబుతో చెప్పి పరిష్కరించుకోవాలని అన్నారు. కేసీఆర్‌తో ఏపీ మంత్రులకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై బురదజల్లడం సరికాదన్నారు. పార్టీ మారే వాళ్లు బురదజల్లే వెళ్తుంటారని చినరాజప్ప వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఒక నాయకుడిగా గౌరవిస్తామన్న ఆయన ఎప్పటికీ తమ నాయకుడు చంద్రబాబే అని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో చింతమనేని ప్రభాకర్‌ ఓ కుటుంబంపై దాడి చేసిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారని తెలిపారు. ఇదిలావుంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. పోదలచుకున్న వాడు చల్లగానే ఉన్నాడు. కానీ ఉన్నవాళ్లే కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌ లోకి

ఫిరాయించబోతున్నట్లుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న రేవంత్‌ రెడ్డి గురించి పార్టీ సీనియర్‌ నాయకుల మధ్య విభేదాలు రావడం విశేషం. రేవంత్‌ రెడ్డికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని కొందరు, షోకాజ్‌ అవసరం లేదని కొందరు సీనియర్లు వాదులాడుకున్నారు. రేవంత్‌ తగాదా కారణంగానే నాయకులు మోత్కుపల్లి, అరవింద్‌ కుమార్‌ అలిగి పార్టీ భేటీనుంచి బయటకు వెళ్లిపోవడం అందరికీ గుర్తుంటుంది. మళ్లీ జరిగిన సమావేశంలోనూ వీరే రేవంత్‌ పై చర్యకు పట్టుబట్టి.. నాయకుల మద్య అభిప్రాయ భేదాలు బయటపడే పరిస్థితి కల్పించారని వార్తలు వస్తున్నాయి.రేవంత్‌ కు బహుశా అంతా హాయిగానే ఉండొచ్చు. ఆయన ఎంచక్కా ఢిల్లీ వెళ్లి రాహుల్‌ తో భేటీ అయి.. కాంగ్రెస్‌ లోకి వస్తే తన భవిష్యత్తు ఏమిటో మాట తీసుకుని వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితే చిత్రంగా ఉంది. రేవంత్‌ విషయంలో అక్కడి నాయకులు తగాదా పడే పరిస్థితి ఏర్పడుతోంది. రేవంత్‌ గురించి జరుగుతున్న ప్రచారం గురించి నివేదిక ఇవ్వాలంటూ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రమణను పురమాయించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కీలక నాయకులు కొందరు ఆదివారం సాయంత్రం సమావేశం అయ్యారు. రేవంత్‌ గురించిన ప్రచారం- పరిణామాల గురించి చర్చించారు. నివేదిక ఇవ్వడం గురించి మాట్లాడుకున్నారు. అయితే రేవంత్‌ కు పార్టీ తరఫున షోకాజ్‌ నోటీసు ఇవ్వవాల్సిందే నంటూ మోత్కుపల్లి నరసింహులు, అరవింద్‌ కుమార్‌ పట్టుపట్టారు. కానీ.. మిగతా నేతలు దీనిని వ్యతిరేకించడం విశేషం. తన విూద జరుగుతున్న ప్రచారం గురించి రేవంత్‌ ఇప్పటికే వివరణ ఇచ్చేశారని, కనుక షోకాజ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు నాయకులు వాదించారు. రేవంత్‌ వివరణ సరిగా లేదంటూ, షోకాజ్‌ ఇవ్వాల్సిందేనని మోత్కుపల్లి పట్టుపట్టినా ఫలితం లేకుండా పోయింది. తన భవిష్యత్తు మార్గం తాను ఎంచుకుని, రేవంత్‌ ప్రశాంతంగానే ఉన్నారు గానీ.. ఆయన గురించి రెండు వర్గాలుగా చీలిపోయి తెలంగాణ తెలుగుదేశం లోని సీనియర్‌ నాయకులు తగాదా పడుతున్నారని తెలుస్తోంది.

తాజావార్తలు