రౌడీషీటర్ గేదెలరాజు హత్యకేసులో మాజీ ఏసీపీ లొంగుబాటు
నిర్దోషిత్వాన్ని నిరూపంచిఉకుంటానన్న రవిబాబు
విశాఖపట్నం,అక్టోబర్20 : విశాఖలో సంచలనం సృష్టించిన గాజువాక రౌడీషీటర్ గేదెలరాజు హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ ఏసీపీ రవిబాబు చోడవరం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో అతనికోసం గాలింపు అవసరం లేకుండా పోలీసుల పని సులవయ్యింది. రౌడీషీటర్ కొప్పెర్ల సత్యనారాయణ రాజు అలియాస్ గేదెల రాజు హత్య కేసులో, గతేడాది సెప్టెంబరు 22న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రియురాలు కాకర్ల పద్మలతది హత్యగా పరిగణిస్తూ ఆ కేసులోనూ రవిబాబు ప్రధాన నిందితుడిగా వారు పేర్కొన్నారు.గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడైన రవిబాబు.. గత రెండు వారాలుగా పరారీలో ఉన్నారు. ఉదయం జాగింగ్ చేసుకుంటూ నేరుగా చోడవరం పోలీసుస్టేషన్‌కు చేరుకున్న ఆయన.. చోడవరం ఎస్సై మల్లేశ్వరరావు, సీఐ శ్రీనివాసురావు ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు సీఐ తెలిపారు. విశాఖ పోలీసులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ తాను నిర్దోషినని.. న్యాయస్థానంలోనే ఆ విషయాన్ని నిరూపించుకుంటానని తెలిపారు. విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన రెండు హత్య కేసుల్లో ఆర్టీసీలో విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబును ప్రధాన నిందితుడని పోలీసు అధికారులు వెల్లడించారు. ఆర్టీసీలో విజిలెన్స్ డీఎస్పీగా పని చేస్తున్న దాసరి రవిబాబు విశాఖ జిల్లా పాయకరావుపేటలో గతంలో సీఐగా పని చేశారు. అక్కడి నుంచి పదోన్నతిపై విశాఖ వచ్చిన అతను పలు విభాగాల్లో ఏసీపీగా పని చేశారు. 2014 నవంబరు 9న మధురవాడ ఏసీపీగా బదిలీ అయ్యారు. పాయకరావుపేటలో రవిబాబు పనిచేసేటప్పుడు తనను నమ్మించి మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే నూకరాజు కుమార్తె కాకర్ల పద్మలత 2016 మార్చి 22న నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఆమె తరచూ నగరానికి వస్తూ రౌడీషీటర్ గేదెల రాజు ఇంట్లో ఉండేది. ఇద్దరికీ రాజీ కుదురుస్తానని రాజు వారిస్తూ వచ్చాడు. అయినా ఆమె వినలేదు. ఆమెను అంతం చేయాలనుకున్న రవిబాబు పథకం పన్నాడు. పద్మలతను హత్య చేయడానికి కోటి రూపాయలకు రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలుత రూ.50 లక్షలు ఇచ్చాడు. పనయ్యాక మిగిలిన రూ.50 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో గతేడాది పద్మలత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె గుండెపోటుతో మరణించిందంటూ అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. అనంతరం మిగిలిన రూ. 50 లక్షల కోసం గేదెల రాజు… రవిబాబుపై ఒత్తిడి తెచ్చాడు. విసిగిపోయిన ఆయన ఇతడిని కూడా అంతం చేయడానికి పథకం వేశాడు. భూ దందాల్లో ఆరితేరిన క్షత్రియభేరి పత్రిక ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజుకు విషయం చెప్పాడు. సహకారం అందిస్తానని అతను చెప్పడంతో హత్యకు వ్యూహం పన్నారు. ఇందుకోసం విశాఖ ఆదర్శనగర్‌లో నివసిస్తున్న సువ్వాడ మహేష్(32)ను ఎంచుకున్నారు. ఇతను పలు కేసుల్లో ప్రధాన నిందితుడు. అతనితో రూ.5 లక్షలకు ఒప్పందం
కుదుర్చుకున్నారు. మహేష్‌తో పాటు మరో ఎనిమిది మందిని సిద్ధం చేశారు. ఈ నెల 6న గాజువాకలోని క్షత్రియభేరి ప్రాంతీయ కార్యాలయంలో హత్య చేయాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే గేదెల రాజుని ఈ నెల 6న మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యాలయానికి భూపతిరాజు పిలిచాడు. అప్పటికే అందరూ మారణాయుధాలతో లోపల సిద్ధంగా ఉన్నారు. గేదెల రాజు వచ్చిన వెంటనే భూపతిరాజు సైగచేశాడు. ఆ వెంటనే అతనిపై ఒక్కసారిగా సువ్వాడ మహేష్, ఎర్ని శ్రీనివాసరావు, కేశవ్, అల్లా గోపి, మైలపిల్లి విజయ్‌కుమార్ అలియాస్ బిల్లా వెనకవైపు నుంచి కర్రలతో… బొంగా మురళి, ఆనంద్‌కుమార్ కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో గేదెలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.