లాంచీని ఒడ్డుకు తెచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

– మృతదేహాలు వెలికితీత
– కుటుంబ సభ్యుల రోధలతో మారుమోగిన ప్రమాద స్థలి
అమరావతి, మే16(జ‌నం సాక్షి) : మంగళవారం సాయంత్రం గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బుధవారం మధ్యాహ్నం ఒడ్డుకు తీసుకువచ్చాయి. కాగా లాంచీలో మృతదేహాలు ఉండటంతో లాంచీ అద్దాలు పగులగొట్టి మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటికే నలుగురి మృతదేహాలను వెలికి తీయగా, అందులో కవల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి, అక్కడే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న బాధితుల కుటుంబసభ్యులు రోధనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. విగతజీవులుగా మారిన తమవారి మృతదేహాల పడి బోరున విలపించారు. కాగా ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
లాంచీని ఆపమని వేడుకున్నా వినిపించుకోలేదు – బాధితులు
లాంచీ మునిగిపోతూ ఉండగా ప్రాణాలకు తెగించి నదిలో దూకిన వారిలో కొందరిని మంటూరు గ్రామస్థులు రక్షించారు. అయితే బాధితులు ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు. ఇలా బతికి బయటపడ్డవారిలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడికి రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. దేవీపట్నంలో లాంచీ ఎక్కిన తర్వాత కంపెనీ దగ్గర సిమెంట్‌ బస్తాలు లోడ్‌ చేశారని, ఈదురు
గాలులకు లాంచీని ఆపమని వేడుకున్నా యజమాని ఖాజా వినిపించుకోలేదని బాధితులు పోశమ్మ, శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిని హాస్పటల్‌కు తీసుకెళ్లి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, తాను ప్రాణాలతో బయటపడినా తన తల్లి బోటులోనే చిక్కుకుపోయిందని శిరీష కన్నీళ్ల పర్యంతమైంది. తల్లిదండ్రులు, సోదరులు గల్లంతవడంతో రాంచరణ్‌ అనాథగా మిగిలాడు.
—————

 

తాజావార్తలు