వంచకుడే ‘వంచన దీక్ష’ చేయడం విడ్డూరం: మంత్రి యనమల

– తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు సంపాదించడం వంచన కాదా?

– పేదల సొమ్ముతో ఎస్టేట్‌లు కట్టుకున్న జగన్‌ వంచకుడు కాదా?

– వైఎస్‌ జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి యనమల

అమరావతి, జ‌నం సాక్షి ) : వంచకుడే ‘వంచన దీక్ష’ చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లక్ష కోట్లు సంపాదించడం వంచన కాదా..? అని ప్రశ్నించారు. వంచకులకు నయ వంచన దినం పాటించే అర్హత ఉందా? అని నిలదీశారు. 12 ఛార్జిషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్‌ వంచకుడు కాదా అని ? సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పేదలకు సేవచేసిన చంద్రబాబుని వంచకుడని అనడం జగన్‌ అవివేకమని యనమల ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌, బెంగళూరులోని ఎలహంక, ఇడుపులపాయలో రాజభవనాలు నిర్మించింది పేదల సొమ్ముతో కాదా అని ప్రశ్నించారు. పేదల సొమ్ము దోపిడీ చేసి ఎస్టేట్లు నిర్మించుకున్న జగన్‌ను మించిన వంచకుడెవరని మండిపడ్డారు. వారంలో నాలుగు రోజులు పాదయాత్ర, రెండ్రోజులు లాయర్లతో భేటీ, ఒకరోజు కోర్టుబోనెక్కడం వంచన కాదా?, విభజన సమయంలో సోనియాతో లాలూచీపడి బెయిల్‌ తెచ్చుకోవడం వంచనకాదా?, కేసుల మాఫీ కోసం ఇప్పుడు బిజెపితో లాలూచీ పడటం వంచన కాదా?, పోలవరంపై ఫిర్యాదులు, కోర్టు కేసులతో అడ్డుకోవడం వంచన కాదా?, రాజధానిపై కోర్టు కేసులు వేయించి ల్యాండ్‌ పూలింగ్‌ అడ్డుకోవడం వంచన కాదా? అని యనమల ప్రశ్నించారు. వైఎస్‌ పాలనలో రైతులు, మహిళలు, యువతను దారుణంగా వంచించారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలను మైక్రో ఫైనాన్స్‌ ఆగడాలకు బిలి చేశారని తెలిపారు. నమ్మకద్రోహం చేసిన భాజపాను విమర్శించకపోవడమే జగన్‌ నయవంచనకు నిదర్శనమన్నారు. మోదీని ప్రశ్నిస్తే బేడీలు పడతాయని జగన్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

తాజావార్తలు