వడగళ్లతో పంటలకు అపార నష్టం
కడప,మే5(జనం సాక్షి): మొన్నటి వర్షానికరి రాయలసీమ జిల్లాల్లో భారీగానే పంటలు దెబ్బతిన్నాయి. దీని
నుంచి కోలుకోక ముందే మళ్లీ వడగళ్లహెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లాలో గాలి దుమారం, వర్షానికి అరటి, బొప్పాయి, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువగా అరటి చెట్లు నేలకొరిగాయి. రైల్వేకోడూరులో 50 ఎకరాల అరటి పంట నేలకొరిగింది. ముద్దనూరు మండలంలో 15 ఎకరాల బొప్పాయి, 40 ఎకరాల అరటి తోటలు నేలకొరగడంతో రైతులకు సుమారు రూ.80 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. బ్రహ్మంగారిమఠం మండలంలో కోత దశకు వచ్చిన వరి పూర్తిగా తడిసిపోయింది. వేంపల్లెలో వంద ఎకరాల్లో అరటి పంట నేలకొరిగింది. వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో గాలులకు మామిడి పంట దెబ్బతింది. కర్నూలు జిల్లా కేంద్రంలో కొన్ని కాలనీల్లో గురువారం నుంచి శుక్రవారం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,751 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రూ.12.05 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా 1,010 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. అరటి పంట 518 ఎకరాల్లో నేలమట్టమైంది. 289 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతింది. 700 ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లింది. ఉద్యానవన పంటలకు సంబంధించి రూ.10.82 కోట్లు నష్టం వాటిల్లగా, రూ.1.23 కోట్లు వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.