వరి కోతలు వాయిదాకు ఆదేశం

మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నిషేధం

కాకినాడ,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): తుపాను, భారీ వర్ష సూచన నేపథ్యంలో విపత్తు దాటే వరకూ జిల్లాలోని రైతులు వరి కోతలు వాయిదా వేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కోరారు. వరి పంట పనలపై ఉన్నా, కుప్పలు వేసినా భారీ వర్షాలకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల నష్టనివారణకు కోతలను నిలిపివేయాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శనివారం వరకు సముద్రంలో వేట నిషేధించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని తిరిగి తీరానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మత్య్సశాఖ అధికారులను ఆదేశించారు. తుపాను రక్షణ కేంద్రాల్లో అవసరమైన సామగ్రి సిద్ధం చేయాలని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు.

విశాఖపట్నం-తూర్పుగోదావరి తీరాల మధ్య తుని వైపు ఇది కేంద్రీకృతమై ఉంది. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు, నిత్యావసర సరకులు సిద్ధం చేయాలని సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. మందులు కొరత లేకుండా చూడాలన్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడినా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్తు సరఫరా విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ అల్పపీడనం ఒడిశా వైపు తరలినా దాని ప్రభావం ఈ రెండు జిల్లాలపై ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు

70 కి.విూ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భావిస్తున్నారు. భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతం వెంబడి ఉన్న 26 మండలాల్లో మరింత తీవ్రత ఉండే అవకాశం ఉందని, ఇక్కడ విపత్తులను ఎదుర్కొనేందుకు, సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. మిగిలిన మండలాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ అభివృద్ధి అధికారులు మంగళవారం నుంచి శనివారం వరకు కార్యస్థానాల్లో ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మంగళవారం జిల్లాలోని అన్ని తుపాను షెల్టర్లను తహసీల్దార్లు పరిశీలించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సహాయక చర్యలకు బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పల్లపు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం నుంచి అన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లు అందుబాటులో ఉంటాయి. రెవెన్యూ, గ్రావిూణ నీటి సరఫరా, రోడ్లు-భవనాలు, జల వనరులు, అగ్నిమాపక, పౌర సరఫరాలు, తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులతో సవిూక్షించారు. భారీ వర్షాలు కురిస్తే ప్రజలను సహాయ శిబిరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

 

 

తాజావార్తలు