వాట్సప్ ఆడియో మెసేజ్ ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న మణిదీప్

6688కాకినాడ: తూగో జిల్లాలోని పెద్దాపురం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి. ప్రియురాలి కోసం చనిపోతున్నానంటూ మృతుడు తన స్నేహితులకు వాట్సప్ ద్వారా ఆడియో మెసేజ్ పంపిన ఆధారాలు పోలీసుల చేతికి చిక్కాయి. కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న సురేంద్రమణిదీప్ కుమార్ అనే యువకుడు, ఓ విద్యార్థిని ప్రేమించుకున్నారు.
అయితే ఉన్నట్టుండి నర్సాపురం బిసీ హాస్టల్‌లో విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అదే సమయానికి సురేంద్రమణిదీప్ కుమార్ పెద్దబ్రహ్మందేవం రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. చనిపోయే ముందు మృతుడు తన స్నేహితులకు పంపిన వాట్సప్ ఆడియో మెసేజ్ ఆధారంగా అనేక కీలక ఆధారాలు బయటపడ్డాయి. తాను ప్రేమించిన యువతిని కళాశాలకు చెందిన లక్ష్మణ్, ట్రిపుల్ఈ బ్రాంచ్ అధ్యాపకుడు శివప్రసాద్ మోసం చేసినట్లు స్నేహితులకు వివరించాడు. వీరి మోసానికి తన ప్రియురాలు చనిపోవాలని నిర్ణయించుకుందని అందుకే ఆమె కోసం తాను కూడా చనిపోయేందుకు సిద్ధపడ్డానని చెప్పారు.
తమ చావుకు కారణమైన ఆ ఇద్దరినీ వదలవద్దని స్నేహితులకు పంపిన చివరి సందేశంలో ఉంది. అన్యంపుణ్యం ఎరుగుని తమ బిడ్డ ఎవరి కోసమో చనిపోయేందుకు సిద్ధపడ్డాడని మణిదీప్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకోవట్లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ హోంమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మొత్తం వ్యవహారంపై పోలీసులు అలసత్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

తాజావార్తలు