వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ఏర్పాటకు ఒత్తిడి
విశాఖపట్టణం,నవంబర్2(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులను భారీగా పెంచేందుకు భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసే అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఎంపి కంభంపాటి హరిబాబు ప్రత్యేక శ్రద్దతో గతేడాదిగా దీనికోసం శ్రమిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, సంఘాలతో సమన్వయంతో పనిచేస్తూ వాటి ఉత్పత్తులకు అంతర్జాతీయ గిరాకీని తీసుకురావడానికి కృషి చేస్తోంది. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబయిల్లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. ఆయా నగరాలకు దగ్గరగా ఉన్న పారిశ్రామిక సంస్థల సౌజన్యంతో నిర్వహిస్తున్న భారీ వాణిజ్య ప్రదర్శనలకు ఆదరణ లభిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ సంస్థ వస్తే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలకమైలురాయిని అధిగమించినట్లేనని పారిశ్రామికవర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖ నగరంలో ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్’ (ఐ.ఐ.పి.) సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని, అనుబంధంగా వంద ఎకరాల్లో ప్యాకేజింగ్ పార్కును ఏర్పాటు చేయాలని ఎంపీ హరిబాబు చేసిన ప్రతిపాదనకు అప్పట్లో కేంద్రం ఆమోదించింది. అనంతరం ఇక్కడికొచ్చిన ఐ.ఐ.పి. ప్రతినిధులు స్థలం, అనుకూలతలను పరిశీలించి సానుకూలంగా స్పందించారు. చివరి నిమిషంలో ఐ.ఐ.పి.ని కాకినాడకు మార్చేశారు. ఈ నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా ఐ.టి.పి.ఒ. ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ఎంపీ హరిబాబు సూచించారు. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు ఉన్నాయని, ఏటా రూ.వేల కోట్ల ఎగుమతులు వందకు పైగా దేశాలకు ఎగుమతవుతున్నందున ఐ.టి.పి.ఒ. ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎంపీ హరిబాబు వెల్లడించారు. వివిధ రంగాల ఉత్పత్తులతో ఐటీపీవో ఏటా జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలను నిర్వహిస్తోంది. ఇతర దేశాల్లోనూ భారీ ప్రదర్శనలను నిర్వహించింది.అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర కీలకాంశాలపై నిపుణులతో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తుంటుంది.