వాయుగుండంతో వర్షాలు: అప్రమత్తం అయిన అధికారులు
శ్రీకాకుళం,నవంబర్16(జనంసాక్షి): విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కాగా… బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలుగు రాష్టాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం జిల్లాకు రానుందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి.. అవసమైన చోట్ల ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.వాతావరణ శాఖ సమాచారం మేరకు జిల్లాలో రానున్న 24 గంటల్లో 20 నుంచి 25 సెం.విూ.ల వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, జలవనరులు, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు తగు సూచనలు ఇవ్వాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. వంశధార, తోటపల్లి, మడ్డువలస ఇంజినీర్లు వరదను అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలువల్లో నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశించారు. పంట పొలాల్లో నీరు నిల్వ లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారులు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణనష్టం లేకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.