విజయవంతంగా విదేశీ పర్యటన
పెట్టుబడులపై సానుకూలత
ఎంవోయూలతో 50వేల మంది ఉపాధి
విూడియా సమావేశంలో చంద్రబాబు
అమరావతి,అక్టోబర్28(జనంసాక్షి): తన విదేశీ పర్యటన విజయవంతంగా జరిగిందని ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎపిలో పెట్టుబడులకు అనేకులు ఉత్సామంగా ఉన్నారని అన్నారు. తాను 9రోజుల్లో 800 మంది సీఈవోలను కలిసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం అమరావతిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన విదేశీ పర్యటన గురించి వివరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఐదు ముఖ్యమైన ఎంవోయూలు కుదుర్చుకున్నామని, వీటిద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సీఎం అన్నారు. వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని, వ్యవసాయంలో వినూత్న పరిశోధనలు చేసిన వారితో మాట్లాడామని తెలిపారు. ఈ రంగంలో వినూత్న ఆలోచనలు చేస్తున్నామని, గేట్స్ మిలిండా, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేదే ముఖ్య ఉద్దేశమని, ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికను వినియోగించుకుంటామని, మూడేళ్లలో చేసిన పనుల వల్ల వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఇదిలావుంటే రాష్ట్రంలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో బస్సు ఢీకొని ముగ్గురు మృతిచెందడం, అలాగే శనివారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతిచెందడం పట్ల ఆయన దిగ్భాంతికి గురయ్యారు. కాగా… ఈ రెండు ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే మృతుల కుటంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.