విజయవాడలో కుక్కలు స్వైరవిహారం
విజయవాడ : రాష్ట్రంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. సర్కార్ వైఫల్యం వల్లే గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడలో కుక్కల దాడితో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.ప్రతి వీధిలో, ప్రధాన సెంటర్లలో జనంపై కుక్కలు దాడి చేస్తున్నాయి. పాదాచారులకు కుక్కల దాడి మృత్యుపాశంగా మారుతోంది. చిన్నారులనైతే ఏకంగా నోటితో కరుచుకొని పోతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కుక్క కాట్ల కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడు నెలల్లో నగరంలో 12,563 మందిపై కుక్కలు దాడి చేశాయి. ఇక కుక్క కాటుకు గురైన వారు ఆస్పత్రికి వెళ్తే వ్యాక్సిన్‌లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇక కుక్కల సంతాన నియంత్రణ, టీకాల కోసం ప్రభుత్వం ఒకో కుక్కపై 600 రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. మున్సిపల్ సిబ్బంది నాలుగు రోజులకోసారి కుక్కలను పట్టుకుని రేబిస్ నిరోధక టీకాలు వేయాల్సి ఉంటుంది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలి. ఇందుకోసం ఒక్కో పురపాలక సంఘం ఏటా 40 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు నిధులు వెచ్చించాల్సి ఉన్నప్పటికీ.. అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామాలలో కుక్కల సంతతి విపరీతంగా పెరిగిపోతోంది. ఇక మున్సిపాలిటీలలో కుక్కలను పట్టుకునేందుకు సిబ్బంది కానీ.. ప్రత్యేక వ్యాన్లు, పరికరాలు కూడా సరిగా ఉండడం లేదునగరంలో రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతున్నా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.అయితే కుక్కల దాడులు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అయినా కుక్కల నియంత్రణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని.. ఇకపై పటిష్ట చర్యలు చేపడతామన్నారు. నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కుక్కల దాడులను నివారించేందుకు మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.