విద్యార్థిఆత్మహత్యలపై విచారణ చేయాలి
వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్
అమరావతి,అక్టోబర్26(జనంసాక్షి): విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తక్షణం విచారణకు ఆదేశించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర ఆందోళన కలిగిస్తున్న కంటితుడుపు చర్యలతో కాలం గడపడం సరికాదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, వైఎస్‌ఆర్ ఎస్‌యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన జరిగిన ఒకరోజు ధర్నా విజయవంతం అయ్యిందని అన్నారు. నారాయణ, శ్రీ చైతన్య ప్రయివేటు విద్యాసంస్థల్లో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఆయా కళాశాలల గుర్తింపును రద్దు చేసి, క్రిమినల్ చర్యలు పెట్టాలని డిమాండ్ చేశారు.కడపలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల నిరవధిక దీక్షలను పోలీసులు బుధవారం భగ్నం చేశారని అన్నారు. కడప నారాయణ బాలికల క్యాంపస్‌లో పావని మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యాశాఖా మాత్యులు నారాయణ విద్యా సంస్థ అధిపతి, సహచర మంత్రికి స్వయానా
వియ్యంకుడు కావడం, ఈ ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు కావడం విద్యాశాఖను పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. ఇంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా మంత్రి నారాయణ నిక్షేపంగా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయనను తప్పుకోమని చెప్పే సాహసం ముఖ్యమంత్రి చేయలేకపోతున్నారు. రాజకీయాల్లో దిగజారుతున్న నైతిక విలువలకు ఇదొక నిదర్శనం అన్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని కళాశాలలోనే విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఏవిూ జరగనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే తనకు తెలిసినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడడం మరీ విడ్డూరంగా వుంది. నీరదారెడ్డి, పద్మావతి మహిళా యూనివర్సిటీ మాజీ విసి రత్నకుమారి, మాజీ ఐఎఎస్ అధికారి చక్రపాణి నేతృత్వంలో కమిటీలు కార్పొరేట్ కళాశాలల్లోని ఈ అమానుష పద్ధతులను అరికట్టాల్సిన ఆవశ్యకత గురించి పదే పదే చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకల్లా తరగతులు ముగించాలని, ఆదివారాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించరాదని, ఆటలు పాటలకు నిర్దిష్టంగా కొంత సమయం కేటాయించాలని ప్రతి కాలేజీలోను సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలతో పాటు, నాన్ అకడమిక్ పుస్తకాలు కూడా ఉంచాలన్న కమిటీ సిఫారసులను అమలు చేసి వుంటే పరిస్థితి కొంతైనా మెరగుపడేదని అన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు వామపక్ష విద్యార్తి సంఘాలు ఉద్యమిస్తాయని అన్నారు.