విద్యార్థుల సహకారంతో మరుగుదొడ్ల నిర్మాణం
అనంతపురం,నవంబర్16(జనంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలను చైతన్యం చేయడం ద్వారానే లక్ష్యాన్ని సాధించగలమని కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేయూ, జేఎన్‌టీయూ విద్యార్థులు భాగస్వాములను చేశామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా వెనుకపడిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే మార్చి
నాటికి అన్ని పంచాయతీలను ఓడీఎఫ్‌గా ప్రకటించాలంటే రోజుకు 4 వేల చొప్పున వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు గ్రామాల్లో ప్రచారం విస్తృతం చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై ఇటీవల ముఖ్యమంత్రి వీసీలో ప్రశ్నించారన్నారు. జిల్లాలో 1.20 లక్షల నిర్మాణాలు పూర్తి అయ్యాయని, వాటిన్నింటిని జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో వేయి మంది విద్యార్థులను, పంచాయతీలో 100 మందిని వినియోగించుకుని పక్రియ వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైన అధికారులు నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.