విభజన హావిూలు అమలుచేయనందుకే

కేంద్రంతో విబేధించాం
– 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా ప్రాతిపదికన తీసుకుంటాననడం బాధాకరం
– పార్లమెంటు స్థానాలూ తగ్గించేస్తారేమో?
– సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ప్రభుత్వం దృష్టిసారించింది
– జూన్‌ నుంచి నిరుద్యోగ భృతి
– జూన్‌ 2నుంచి అన్నా క్యాంటిన్‌లు ప్రారంభిస్తాం
– కరెంట్‌ చార్జీలు పెంచబోమని చెప్పిన ప్రభుత్వం మనదే
– కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
అమరావతి, మే8(జ‌నం సాక్షి) : విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హావిూలు నెరవేర్చనందుకే కేంద్రంతో విభేదించి ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతిలో మంగళవారం కలెక్టర్‌ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..  విభజన సందర్భంగా జరిగిన అన్యాయంకంటే ఈ నాలుగేళ్లలోనే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హావిూల గురించి గట్టిగా ప్రశ్నించకపోతే రాష్ట్రం ఇంకా నష్టపోతుందనే కేంద్రాన్ని నిలదీస్తున్నామన్నారు. విభజనతో సమస్యల్లో ఉన్న ఆంధప్రదేశ్‌కు కేంద్రం సహకరించకుండా పోయిందన్నారు. 15వ ఆర్థిక సంఘం తీరును గమనిస్తే మరింత బాధ కలుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం 2011జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటాననడం విచారకరమన్నారు. జనాభా నియంత్రణ కోసం నాడు తెదేపా హయాంలో తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు సాధించామన్నారు. 2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే దక్షిణ భారతానికి పార్లమెంటు సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం వుందన్నారు. ఇది ప్రగతిశీల రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. 14వ ఆర్థిక సంఘం 1971జనాభాను ప్రాతిపదికగా తీసుకుందని, కొత్త ఆర్థిక సంఘం 2011 జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే ఆంధప్రదేశ్‌కు మరింత నష్టం కలుగుతుందన్నారు. అటు విభజన వల్ల, ఇటు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. నాలుగు సంవత్సరాలు కష్టపడి దేశంలో ఎక్కడా జరగని అభివృధ్దిని సాధించిందుకు ప్రతి ఒక్క ఉద్యోగిని అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటి విూద తమ ప్రభుత్వం సమాన దృష్టి పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు.
జూన్‌ నుంచి నిరుద్యోగ భృతి..
రాష్ట్రంలో నిరుద్యోగులను గుర్తించి వారికి నిరుద్యోగ భృంతి ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కలెక్టర్‌ల సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై చర్చించారు. జూన్‌ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని యోచన ఉందని బాబు స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతిపై త్వరలోనే విధివిధానాలు విడుదల చేస్తామని తెలిపారు. కరెంట్‌ చార్జీలను పెంచబోమని ప్రకటించిన ప్రభుత్వం మనదేనని సీఎం చెప్పారు.  ప్రజలకు ఇబ్బందుల్లేని పరిపాలన అందిస్తున్నామని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నామని, ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరిగిందన్నారు. అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడమే లక్ష్యమని, చంద్రన్న బీమా అమలుపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో వందశాతం గ్యాస్‌ ఇచ్చామని, అన్ని గ్రామాలకు సిమెంట్‌ రోడ్లు వేస్తున్నామని సీఎం తెలిపారు. ఇప్పటి
వరకు రాష్ట్రంలో 16వేల కి.విూ మేర రోడ్లు వేశామని, పచ్చదనం పెంపొందించడంలో దేశంలోనే ముందున్నామన్నారు. చంద్రన్న పెళ్లికానుకను నేరుగా లబ్దిదారుల ఖాతాలో వేస్తామని, వచ్చే నెల 2 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. ఏడాదిలోగా కోటి ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్షన్లు ఇస్తామని, తలసరి ఆదాయంలో 9వ స్థానంలోఉన్నామన్నారు. వ్యవసాయ రంగంలో ఎంతో వృద్ధి సాధించామని, రాష్ట్రంలో సర్వీస్‌ సెక్టార్‌ అభివృద్ధి చెందాలన్నారు.  గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధిహావిూ పథకాన్ని సమర్థంగా వినియోగించుకున్నామన్నారు. సాగునీటిరంగంలో రూ.46 వేల కోట్లు ఖర్చు పెట్టామని, కుటుంబానికి రూ.10 వేల ఆదాయమే లక్ష్యంగా, పేదరికం పోవాలంటే ప్రజలకు ఉపాధి కల్పించాలన్నారు. రూ. 12వేల కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరు అందించే పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

తాజావార్తలు