విశాఖలో ఐఐటీ-జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష కేంద్రం
విశాఖపట్టణం,ఏప్రిల్2(జనంసాక్షి): ఐఐటీ – జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు ఈ సారి విశాఖను కూడా కేంద్రంగా ఎంపిక చేశారు. 3వ తేదీ ఆదివారం జరిగే ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల విద్యార్థులకు విశాను కేంద్రంగా చేశారు. గతంలో గుంటూరు కేంద్రంగా ఉండగా అనేక వ్యయప్రయాసలకోర్చి రెండు రోజులముందే గుంటూరు వెళ్లాల్సి వచ్చేది. తొలిసారిగా ఈ పరీక్షలకు ఆతిథ్యమిస్తున్న విశాఖ నగరంలో ఏర్పాట్లపై అయోమయం ఉన్నా, కేంద్రం మాత్రం ఏర్పాటయ్యింది. గతంలో గుంటూరు మాత్రమే పరీక్ష కేంద్రం ఉండేది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిమంది విద్యార్థులు ఎన్నో అవస్థలు పడేవారు. గుంటూరులో పరీక్ష నిర్వహణ చాలా కష్టంగా ఉందని, వేలాదిమంది అవస్థలు పడుతున్నారని ఆ జిల్లా అధికారులు కేంద్రానికి ఎన్నోసార్లు విన్నవించారు. అక్కడి స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ విద్యాసంస్థలు విద్యార్థుల కోసం ఎన్నో ఏర్పాట్లు చేసి అండగా నిలిచాయి. వసతి, అల్పాహారం, భోజన ఏర్పాట్లను ఉచితంగానే అందించి ఆదుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల విజ్ఞప్తులకు స్పందించిన కేంద్రం ఎట్టకేలకు ఈ ఏడాది విశాఖను కేంద్రంగా ప్రకటించింది. అదీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఈ కేంద్రంలో సుమారు 20 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. విశాఖ నగరంలో 32 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు సమాచారం. విశాఖ నగరంలోని పరీక్ష కేంద్రాలన్నింటినీ సమన్వయ పరచుకునే అధికారి లేకపోవడంతో స్థానిక అధికారులకు కూడా సమచారం లేదని తెలుస్తోంది.