విశాఖలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం..

విశాఖపట్టణం : విద్యార్థుల అరెస్టు పర్వం కొనసాగుతోంది. విశాఖపట్టణంలో విద్యార్థులపై పోలీసులు నిర్వహించిన లాఠీ ఛార్జీకి నిరసనగా ఎస్ఎఫ్ఐ బంద్ కు పిలుపునిచ్చింది. దీనితో పలు కళాశాలలు మూతపడ్డాయి. బంద్ ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ బుధవారం పలు ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన నిర్వహించారు. వీరిని ఎక్కడికక్కడనే అరెస్టు చేసి వ్యాన్ లలో తరలించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేత రాముతో సహా పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి సంఘ నేతలు స్పష్టం చేశారు. ప్రశాంతంగా విద్యా సంస్థల బంద్ కొనసాగుతుంటే అరెస్టులు చేయడం సబబు కాదని వివిధ ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. పోలీసు కమిషనర్ వైఖరిని విద్యార్థులు తప్పుబడుతున్నారు.హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం విరుచుకుపడింది. పై నుండి అందిన ఆదేశాలతో విశాఖలో విద్యార్థులపై మంగళవారం లాఠీలు కరాళ నృత్యం చేశాయి. బెదిరింపులూ, పిడిగుద్దులతో పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. పదేపదే విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు సమస్యలు నివేదించడానికి తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు ఇష్టానుసారం కొట్టారు. విద్యార్థినీలను సెల్‌పోన్లో చిత్రీకరించారు. 500 మందిని అరెస్ల్‌ చేశారు. పోలీసుల ఈ అమానుష దాడిలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలైనాయి. ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ లాఠీఛార్జిని తీవ్రంగా ఖండించారు. పోలీసు కమిషనర్‌ను కలిసి, ఈ సంఘటనకు పాల్పడ్డ పోలీసులపై చర్య తీసుకోవాల్సిందిగా కోరారు.

తాజావార్తలు