విశాఖలో భారీ భూదందా
విశాఖపట్నం, ఆగస్టు 31 : జిల్లాలోని భారీ భూదందా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఎర్రా ఈశ్వర్‌ను విచారించగా ముఖ్యమైన రహస్యాలు బయపడ్డాయి. ఆనందపురం మండలం కుసులవాడకు చెందిన రియల్ బ్రోకర్ ఎర్రా ఈశ్వర్‌రావు పలువురు ప్రముఖులకు రూ.కోట్లలో టోకరా వేశాడు.
మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజుకు సంబంధించి భూమి ఇప్పిస్తానంటూ రూ.కోటి వరకు అడ్వాన్స్ తీసుకుని తప్పించుకుని తిరుగుతున్నాడు. అలాగే ఆనందపురం మండలం నేలచెరువు నివాసి రామకృష్ణకు చెందిన 5.6 ఎకరాలను జీపీఏ పద్దతిలో రిజిస్ట్టేషన్ చేయించుకుని వాయిదాల్లో నగదు ఇస్తానంటూ మోసానికి పాల్పడ్డాడు. మరో ఎమ్మెల్యే కజిన్ వాసుపల్లి భవానీ ప్రసాద్ సంస్థ నుంచి భూమిని చూపిస్తానంటూ రూ.2.15 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుని భూమి రిజిస్ట్రేషన్ చేయించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈశ్వర్ భూమాయకు సంబంధించి ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఎంవీపీ కాలనీకి చెందిన చిన్నా అనే వ్యక్తి నుంచి రూ.50 లక్షలు తీసుకుని బక్కనపాలెంలోని దేవాదాయశాఖకు చెందిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
గతంలో ఈశ్వరన్‌పై ఫిర్యాదు అందినప్పటికీ ప్రస్తుతం ఏసీపీ స్థాయిలో ఉన్న ఓ పోలీసు అధికారి అతనికి వత్తాసు పలికి కేసును నమోదు చేయకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఏసీపీ పాత్రపై సీపీ అమిత్‌గార్గ్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ నిందితుడు ఈశ్వరన్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దాదాపు రూ.15 కోట్లకు పైగా ఎర్రా ఈశ్వర్‌రావు వసూలు చేశారని తెలుస్తోంది.