విషవాయువు పీల్చి 15 మంది విద్యార్థుల అస్వస్థత


హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న భోలక్‌పూర్‌లో విషవాయువు పీల్చడం వల్ల 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో యాసిడ్‌, తదితర రసాయనాలతో కూడినవ విషవాయువును పీల్చడంతో అంజుమన్‌ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారు. దాదాపు 30 మందికి ఈ ప్రభావం సోకినా 15 మందికి మాత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే పాఠశాల యాజమాన్యం గాంధీ ఆస్పత్రికి తరలించింది. ఇదిలా ఉండగా స్కూల్‌ ఆవరణ శుభ్రం చేస్తున్న సమయంలో వచ్చిన యాసిడ్‌ విష వాయువును పీల్చడం వల్లే విద్యార్థులు
అస్వస్థతకు గురయ్యారన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే స్కూల్‌కు సమీపంలో పలు పరిశ్రమలు ఉండటంతో వాటి నుంచి విషవాయువు వెలువడి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా పిల్లల అస్వస్థతతో సమీప పరిశ్రమలపై చర్చ మళ్లీ ప్రారంభమైంది. గతంలో పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాల వల్ల వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు.ఈ ప్రాంతంలో తోళ్ల పరిశ్రమలు ఉండటంతో కుళ్లిపోయిన జంతువుల కళేబరాలు, తోళ్లను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో కాలుష్యం నిరంతరం వెలువడుతూనే ఉంటుంది. అప్పట్లో మంచినీటి సరఫరా చేసే పైపుల్లోకి విష పదార్థాలు చేరడంతో వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్పట్లో ఉద్యమాలు జరిగాయి.