వైసీపీ గ్రాఫ్ పెరుగుతోంది – బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు
– ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ పతనం ఖాయం
– కర్ణాటకలో చంద్రబాబు మాట వినే స్థితిలో ఎవరూలేరు
– అక్కడ బీజేపీదే అధికారం
తిరుమల,మే2( జనం సాక్షి): ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయిందని, వైసీపీ గ్రాఫ్ పెరిగిపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. టిడిపిపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని అన్నారు. బుధవారం తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019ఎన్నికల్లో టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే వైసీపీ కంటే 5లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ పతనం ఖాయమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి ఎలాంటి అవగాహనలేదని విష్ణుకుమార్‌రాజు తెలిపారు. అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని చెప్పారు. చంద్రబాబు చేస్తున్నది అధర్మ పోరాటమని విమర్శించారు. పట్టిసీమపై 15 రోజుల్లో సీబీఐ విచారణ కోరతామని, పట్టిసీమ ప్రాజెక్ట్‌లో అవినీతికి పాల్పడిన వారికి శిక్షపడుతుందని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడని, అసలు అక్కడ చంద్రబాబు మాట వినే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు. కర్ణాటకలో సిద్ధిరామయ్య ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అక్కడ బీజేపీ గెలుపు ఖాయమని విష్ణుకుమార్‌రాజు ధీమా వ్యక్తం చేశారు.