శారీరక, మానసిక ఆరోగ్యంతో మంచి భవిష్యత్తు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
మంచిర్యాల ప్రతినిధి, జులై 12, (జనంసాక్షి) : శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలో 9వ యోనెక్స్ – సన్‌రైజ్ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అండర్-19 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2028 పోటీలను రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, డి.సి.పి. సుధీర్ రామ్‌నాథ్ కేకన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బ్యాడ్మింటన్ ఛాంపియన్ షివ్ పోటీలను నిర్వహించేందుకు కృషి చేసిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యుల కృషి అభినందనీయమని తెలిపారు. ఈ మధ్య కాలంలో పిల్లలు కేవలం చదువుపై శ్రద్ధ వహిస్తున్నారని, పిల్లలకు శారీరక ధృఢత్వం, మానసిక ఉల్లాసంఅవసరమని, ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణతో పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొందించవచ్చని, వారి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. అనంతరం కమీషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లతో పిల్లల జీవనశైలి మారిపోయిందని, కొవిడ్ కాలంలో నెలకొన్న పరిస్థితులతో పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు మరింతగా అలవాటు అయ్యారని, ఈ పరిస్థితిని మారుస్తూ పిల్లలను క్రీడల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని తెలిపారు. శరీరాన్ని ధృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంతో ఆలోచన బావుంటుందని, ఆలోచన బావుంటే భవిష్యత్తు మరింత బావుంటుందని, శరీరాన్ని, మనస్సును సమర్థవంతంగా ఉంచడంతో మంచి సమాజాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.సి.పి. తిరుపతిరెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధి గాజుల ముఖేష్‌గౌడ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.