శిల్పారామంలో అమ్యూజ్మెంట్ పార్క్ కోసం రూ. 24 కోట్లు విడుదలయ్యాయి
అమ్మవారి సాక్షిగా మహబూబ్నగర్ దినదినాభివృద్ధి చెందుతుంది
మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 12 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ప్రభుత్వం తరఫున స్థానిక రవీంద్ర నగర్ లో ఉన్న పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రవీంద్ర నగర్ పోచమ్మ అమ్మవారి దేవాలయం 33వ వార్షికోత్సవ ఉత్సవాలు మరియు ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి అధికారులంతా ప్రభుత్వం తరఫున అధికారిక ఏర్పాట్లు చేసి బోనాల పండుగను నిర్వహించుకోవడం తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయానికి గుర్తుగా ఆయన అభివర్ణించారు. ఉమ్మడి జిల్లాలో వలసలు ఆగిపోయాయని ప్రజలంతా సంతోషంగా జీవిస్తూ పండుగలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు . వివిధ పండుగల సందర్భంగా గతంలో ఉన్న అవాంఛనీయ సంఘటనలేవి జరగకుండా పట్టణంలో శాంతిభద్రతలు నెలకొన్నాయన్నారు.
పోచమ్మ అమ్మవారి సాక్షిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం దినాభివృద్ధి చెందుతూ ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అమ్మవారు ఇచ్చిన శక్తితో మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో ట్యాంక్ బండ్, శిల్పారామం అభివృద్ధి చేపడుతున్నామని , తాజాగా శిల్పారామంలో అమ్యూజ్మెంట్ పార్కు కోసం ప్రభుత్వం రూ. 24 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. దీంతోపాటు పట్టణంలో ఆధునిక ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.6 కోట్లను సైతం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఇచ్చిన శక్తితో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.
రవీంద్ర నగర్ పోచమ్మ బోనాల త పాటు , జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు కొత్తగంజి కోయిలకొండ ఎక్స్ రోడ్డు కిద్వాయిపేట బండమీద పల్లి బీకే రెడ్డి కాలనీలలో జరిగిన బోనాల పండుగకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు వేద, గోవిందు, లక్ష్మి, ఆనంద్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు రాములు, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి గౌడ్, నవకాంత్, తదితరులు పాల్గొన్నారు.