శిశువు సజీవ సమాధికాకుండా కాపాడిన చిన్నారి
నాసిక్: ఒక నవజాత శిశువు సజీవ సమాధికాకుండా ఓ పదేళ్ల చిన్నారి కాపాడింది. గురువారం నాగర్‌సూల్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పదేళ్ల సురక్ష్యా గురువారం తన ఇంటిముందు ఆడుకుంటోంది. ఈ లోగా ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై అక్కడికి వచ్చి దగ్గర్లోనే ఉన్న ఒక గుంటలో చిన్న బిడ్డను పూడ్చేసి హడావుడిగా పారిపోయారు. కాసేపటికి ఆ గుంటలోపలి నుంచి బిడ్డ ఏడుపులు వినిపించాయి. ఈ విషయాన్ని సురక్ష్యా పరుగెత్తికెళ్లి నాన్నకు చెప్పింది. సంబంధిత జిల్లా పరిషద్ సభ్యుడు కూడా అయిన సురక్ష్యా వాళ్లనాన్న సాయినాధ్‌మోరే.. విషయాన్ని పోలీసులకు తెలిపారు. స్థానికుల సాయంతో బిడ్డను వెలికి తీశారు. మట్టికొట్లుకుపోయి కోన ఊపిరితో ఉన్న ఆడశిశువును స్థానిక ఆరోగ్యకేంద్రానికి తరలించి చికిత్స చేశారు. పాపను నాసిక్ సివిల్ అసుపత్రిలో ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. పాప ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందనీ మెల్లగా కోలుకుంటోందని వైధ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.