శీతాకాల సమావేశాల బహిష్కరణ

ఆ 20మందిపై బహిష్కరణ వేటుకు వైకాపా డిమాండ్‌

అప్పుడే సమావేశాలపై పునరాలోచన: పెద్దిరెడ్డి

హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష వైకాపా నిర్ణయించుకొంది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. లోటస్‌పాండ్‌లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై ఆ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా చర్యలు తీసుకోలేదు అని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన వారు అధికార టిడిపిలో చేర్చుకున్నారని, పైగా పార్టీ మారినవారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టారన్నారు. మంత్రి పదవిని చేపట్టిన వారిని వైకాపాలో ఉన్నట్లు చూపిస్తున్నారన్నారు. తొలుత ఆ 21 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే సమావేశాలకు హాజరయ్యే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష సమావేశం గురువారమిక్కడ జరిగింది. అనంతరం పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం వివరాలను విూడియాకు వివరించారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని రామచంద్రారెడ్డి చెప్పారు. సభలో తాము ప్రశ్నలు అడిగితే.. తమ పార్టీ నుంచి గెలిచి మంత్రులుగా ఉన్నవారు సమాధానం చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్పీకర్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, 21 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తేనే తాము సభకి వెళతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ బహిష్కరణ విషయంలో తమకు ఎన్టీఆరే ఆదర్శమని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోని పక్షంలో అన్ని సమావేశాలను బహిష్కరిస్తామని వైసీపీ డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఫిరాయింపుకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేస్తేనే శాసనసభకు హాజరు అవుతామని ఆయన తెలిపారు. ‘ఫిరాయింపులపై ప్రభుత్వం అప్రజాస్వామి కంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రులు చేశారు. తాజా అసెంబ్లీ బులిటెన్‌లో 66మందిని వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యులుగా చూపించారు. ఇరవైమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి…నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రివర్గం నుంచి తొలగించాలి. అప్పుడే సభకు హాజరు అవుతామని అన్నారు. తాము ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏకపక్షంగా నిర్వహిస్తోంది. ప్రతిపక్షంగా మా గొంతను నొక్కేస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఐదేళ్లలో 156 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే… గత నాలుగేళ్లలో చంద్రబాబు కేవలం 80 రోజులు సభ నడిపారని అన్నారు. సభలో ప్రతిపక్ష నేతను తిట్టే కార్యక్రమాన్నే నిర్వహిస్తున్నారు పత్ప మరోటి లేదు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌లను కలిసి అప్రజాస్వామిక విధానాలను వివరిస్తాం.’ అని పెద్దిరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ లోని రావినారాయణరెడ్డి సమావేశ మందిరంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నపుడు ఆరు నెలలపాటు ఇతర జిల్లాల్లో పార్టీ శ్రేణులు చేయాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 11న జరిగిన విస్తృత సమావేశంలో

జగన్‌ పార్టీ నేతలనుంచి ఇదే అంశంపై అభిప్రాయాల్ని తెలుసుకున్న విషయం విదితమే. వాటి ఆధారంగా రూపొందించిన కార్యాచరణపై జగన్‌ దిశానిర్దేశర చేశారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు.

తాజావార్తలు