శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
కర్నూలు,అక్టోబర్20(జనంసాక్షి): కార్తీక మాసం, తొలి శుక్రవారం కావడంతో శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారి దర్శనానికి, కుంకుమార్చనలరకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే భక్తులు పాతాళగంగ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించు కున్నారు. ఆలయంలో అభిషేకాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కార్తీక మాసోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అభిషేకాలు, కుంకుమార్చన టిక్కెట్లను విక్రయించనున్నట్లు చెప్పారు. ఆలయ క్యూ కాంప్లెక్స్‌లోనూ వాటిని పొందే ఏర్పాట్లు ఉంటాయన్నారు. నిర్దిష్ఠ సమయాల్లో అభిషేకాలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అభిషేకం టిక్కెట్లను భక్తులు పెద్ద ఎత్తున బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. కార్తీకమాసంలో భక్తులను ఆధ్యాత్మికంగా ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్తీకమాసంలో భక్తులకు మరింత సమాచారం చేరవేసేందుకు ఫేస్‌బుక్, వాట్సప్‌లను విస్తృత పరుస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే కార్తీకమాసోత్సవాలను పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల ఆలయవేళల్లో మార్పులు చేశారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి భక్తులను అభిషేకాలు, 5 గంటల నుంచి ఇతర ఆర్జిత సేవలు నిర్వహించుకోవచ్చు. 5 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు.