సంక్షోభంలో జట్టుగా పనిచేసి ఏపీని అభివృద్ధిలో తెచ్చాం

– అందుకు అధికారుల పాత్ర అభినందనీయం 
– ఇదే స్ఫూర్తితో  రాబోయేకాలంలోనూ పనిచేయాలి
– అమరావతి లాంటి నగరం ప్రపంచంలో మరెక్కడా రాదు
– 2029కి ముందే దేశంలో ఏపీ నెం.1 రాష్ట్రంగా ఎదుగుతుంది
– ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలి
– రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలి
– కలెక్టర్‌ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
– పలు అంశాలపై కలెక్టర్‌లకు దిశానిర్దేశం చేసిన సీఎం
అమరావతి, మే9(జ‌నం సాక్షి) : నూతన ఆలోచనల సృష్టికి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేందుకు కలెక్టర్ల సమావేశం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంక్షోభంలో జట్టుగా పనిచేసి ఎక్కడా లేని అభివృద్ధి సాధించామని.. అందుకు అధికారులను అభినందిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండోరోజు ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పటివరకు సాధించిన ఫలితాల్లో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందన్న ముఖ్యమంత్రి… విజయం అనేది నిరంతరం శ్రమతో సాధ్యమని, కొద్దిపాటి మనసు పెడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. అమరావతి లాంటి నగరం ప్రపంచంలో మరెక్కడా రాదన్నారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్‌ తమదేనని.. తాము చేపడుతున్న కార్యక్రమాలు ధనిక రాష్ట్రాలకు కూడా అమలు చేయలేకపోతున్నాయని అన్నారు. నాలుగేళ్ల విజయాల్లో గ్రామస్థాయి అధికారి నుంచి సీఎంవో అధికారుల వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. ప్రస్తుతం ఒక స్థాయికి వచ్చామని, దానిని నిలుపుకుంటూ ఇంకా ముందుకు వెళ్లేందుకు మనందరం మరింత కష్టపడాలని సీఎం సూచించారు. ఒక జిల్లా విజయం సాధించాలన్నా, ఒక కార్యదర్శి విజయం సాధించాలన్నా, మంత్రి విజయం సాధించాలన్నా మంచి జట్టును ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాము పేరు కోసమే పనిచేసే వాళ్లమని, తాము చేసే అభివృద్ధి, మంచిపనుల వల్ల తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను 2029 కంటే ముందే దేశంలో నంబర్‌వన్‌ రాష్ట్రం అవుతుందని.. తన జట్టు(అధికారులు)ను చూశాక ఆ నమ్మకం రెట్టింపయ్యిందని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఇన్నోవేటర్స్‌ అందరూ ఏపీకి వచ్చేలా చూడాలన్న ముఖ్యమంత్రి, వాళ్ల ఆవిష్కరణలకు ఆంధప్రదేశ్‌ వేదిక కావాలన్నారు. ఇండియాలో ఇన్నోవేషన్‌ వ్యాలీ ఎక్కడ ఉందంటే ఏపీనే గుర్తుకురావాలని, ఆరోజు ఎంతో దూరంలో లేదన్నారు. ప్రతీశాఖ వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచన చేయాలని సూచించారు. పంచాయతీరాజ్‌ శాఖ ఈ విషయంలో ముందుందని, గ్రామాలకు సంబంధించి సమస్త సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయడం అభినందనీయమన్నారు. పరిష్కార వేదిక’ కాల్‌ సెంటర్‌ను జిల్లా కలెక్టర్లు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరైనా అవినీతి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ సమాచారాన్ని ఆర్టీజీ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తామని.. ఈ సమాచారాన్ని అధికారులు ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ నెలలో ప్రజల సంతృప్తి స్థాయిని 5శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సేవల రంగం, మౌలిక వసతులు, పరిశ్రమల రంగం, పట్టాణాభివృద్ధి మిషన్‌, నైపుణ్యాభివృద్ధిపై సదస్సులో చర్చించారు. ఈ అంశాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఎలక్టిక్ర్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలి..
రాష్ట్రంలోని 24 వేల సోలార్‌ పంపుసెట్లను గ్రిడ్‌కు అనుసంధానించాలని… దీంతో అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి పెంచడం ద్వారా యూనిట్‌ విద్యుత్‌ ధరను రూ. 5.50 నుంచి రూ. 3.75కు తగ్గించగలిగామని అన్నారు. ఎలక్టిక్ర్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. చెత్తను సేకరించేందుకు ప్రస్తుత వాహనాల స్థానంలో ఎలక్టిక్ర్‌ వాహనాలు ప్రవేశ పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శిల్పారామాల ఏర్పాటే కాదు… వాటి నిర్వహణ ఉత్తమంగా ఉండాలని సూచించారు. అమరావతిలో శిల్పారామం ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయించాలన్నారు. తొమ్మిది జిల్లాల్లో చేపట్టిన శిల్పారామం పనులను త్వరతగతిన పూర్తి చేయండని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశించారు.
————————————–

తాజావార్తలు