సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు
నెల్లూరు,ఏప్రిల్2(జనంసాక్షి): నెల్లూరు శాంతినగర్‌లోని పూజ పార్క్ అపార్ట్‌మెంట్‌లోని సబ్‌రిజిస్ట్రార్ నందకిశోర్ ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. స్టోన్‌హౌస్‌పేట బ్రాంచ్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న నందకిశోర్ ఇంటితోపాటు, వివిధ ప్రాంతాల్లోని అతని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులుఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.2కోట్ల వరకు అక్రమాస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. బినావిూ పేర్లతో లావాదేవీలు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలిందన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే నందకిశోర్ అక్రమాలపై సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ వెల్లడించారు. ఇదిలావుంటే నెల్లూరులో ఎసిబికి పట్టుబడిన సబ్‌రిజిస్ట్రార్ నందకిశోర్ బినావిూ ఆస్తులు గుర్తించేందుకు సోదాలు చేపట్టారు. కావలిలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు మూడు ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు చేశారు. కావలిలోని జనతాపేటలో నందకిశోర్ తల్లి రాజ్యలక్ష్మి నివాసంలో సోదాలు చేయగా ఆయన పేరున ఉన్న ఒక మారుతీకారు, పలు బ్యాంకు ఖాతాల పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఇటీవలే నందకిశోర్ జనతాపేటలో రూ.50 లక్షలు విలువ చేసే ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పట్టణంలోని పాతవూరులో బాలకోటేశ్వరరావు అనే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడి ఇంట్లో సోదాలు నిర్వహించగా బాలకోటేశ్వరరావు భార్య ఇందు పేరుతో ఎనిమిదెకరాల పొలం, రెండు ఎ/-లాట్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి నందకిశోర్ బినావిూ ఆస్తులని బాలకోటేశ్వరరావు అంగీకరించారు. ఈ దాడుల్లో ప్రకాశం ఏసీబీ డీఎస్పీ మూర్తి, కర్నూలు జిల్లా సీఐలు పాల్గొన్నారు.