‘సరస్వతీదేవి దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గ
విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజైన సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం కూడా ఇదేరోజు కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. సరస్వతిదేవి అలంకరణలో ఉన్న జగన్మాతను దర్శించుకుంటే సకల శుభాలు, బుద్ధి ప్రసాదం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
అమ్మవారి దర్శనానికి వేకువజామున రెండు గంటల నుంచే కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ఐదు క్యూలైన్లలో భక్తులను ఉచిత దర్శనానికి అనుమతించడంతో తొక్కిసలాట జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాసరావు, అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.