సామదానభేదాలు ముగిసాయి
ఇక మిగిలింది దండోపాయమే
మోడీకి తెలుగువాడి రుచి ఏమిటో చూపిస్తాం
ప్రజలు భాజపాను తరిమికొడతారు
ధర్మపోరాటసభలో బాలకృష్ణఉద్వేగ ప్రసంగం
విజయవాడ,ఏప్రిల్20(జనంసాక్షి): విభజన హావిూల కోసం సామ, దాన, భేద ఉపాయాలు అయిపోయాయినని ఇక మిగిలింది దండోపాయమేనని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న బాలకృష్ణ.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. మోదీ రాజ్యాంగంతో పాటు తన భార్యను కూడా గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. దేశంలో రెండో భాష తెలుగని.. ప్రధానిగా ఉన్న మోదీ తెలుగు నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఇక యుద్ధం మొదలైందని.. భాజపాను ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. దాన, బేదాలు అయిపోయాయని, ఇప్పుడు దండోపాయం జరుగుతుందన్నారు. మోదీ తెలుగు నేర్చుకోవాలన్నారు. మోదీ ఇష్టమొచ్చినట్లు పాలించడానికి ఇది గుజరాత్ కాదని, ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్నారు. రాజకీయాల్లో మోదీ కంటే చంద్రబాబు సీనియర్ అని, అనుభవజ్ఞులను ఎలా గౌరవించాలో మోదీ నేర్చుకోవాలని బాలయ్య సూచించారు. సామాన్య, పేద ప్రజల అవసరాలు ఏమిటో మోదీ తెలుసుకోవాలన్నారు. ఈ విషయాలన్నీ మోదీకి అర్థమయ్యే విధంగా బాలకృష్ణ హిందీలో మాట్లాడారు. మోదీ ఉత్తర, దక్షిణ భారత దేశం అంటూ రాష్టాల్లో విబేధాలు సృష్టిస్తున్నారని బాలకృష్ణ ధ్వజమెత్తారు. తెలుగువారు పిరికివాళ్లు కాదని, తెలుగువారి సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. ప్రధాని ఎవరెవరితోనో కుప్పిగెంతులు వేయిస్తూ, చిల్లర రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా మట్టి, నీళ్లు ఇచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అప్పట్లో భాజపాకు అధికార భిక్ష పెట్టింది
ఎన్టీఆర్, చంద్రబాబులేనని గుర్తుచేశారు. తెలుగువారు పిరికివారు కాదని చిల్లర రాజకీయాలు చేస్తూ అపహాస్యం చేయొద్దని హెచ్చరించారు. వైకాపా, భాజపా లోపాయికారీ ఒప్పందాలు అందరికీ తెలుసనని… వచ్చే ఎన్నికల్లో భాజపాకు ఒక్క సీటు కూడా రాదన్నారు. ప్రత్యేక ¬దా కోసం ఒక్కొక్కరు విప్లవ యోధులు కావాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎంతో మంది వీర పుత్రులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మనదని, ఎంతోమంది ప్రవక్తలు పుట్టిన వేధభూమి మనదని, పల్నాటి బ్రహ్మనాయుడు నడయాడిన నేలమనదని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, వాళ్ల గుళ్లకు గుండెను ఎదురొడ్డిన జగజ్జట్టీలకు జన్మనిచ్చిన పోతుగడ్డమనదని బాలయ్య వ్యాఖ్యానించారు. పద్యపాటవాల్లో మగవారికి ధీటుగా మోగించిన మగువల పుట్టినిల్లు మనదని, కళారంగాలలో ఘనతకెక్కిన వీరమాతల, వీరవణితల కన్న పుణ్యభూమి మనదని ఆయన వ్యాఖ్యానించారు. మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీదుల్లో తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం 1982లో నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి… 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారని, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీ, వెనుకబడిన తరగతుల కులాలను పైకితీసుకువచ్చి అధికారపీఠంపై కూర్చోబెట్టిన మహానుభావుడు ఎన్టీరామారావని బాలయ్య కొనియాడారు. పేదవాడి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని అన్నారు. శాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వలన లోటు బ్జడెట్‌తో ఏర్పడిన ఆంధప్రదేశ్‌ను తన అనుభవంతో చంద్రబాబునాయుడు అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళుతున్నారని, ఇలాంటి సమయంలో ఏపీని అన్నివిధాలా ఆదుకుంటుందని, సహాయ సహకారాలు అందిస్తుందన్న ఆశతో టీడీపీ, ఎన్డీయేతో పొత్తుపెట్టుకుందని బాలకృష్ణ అన్నారు. చివరిగా రాజధానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం అంటూ బాలకృష్ణ తన ప్రసంగాన్ని ముగించారు.