సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 35 శాతం లాభాల వాటా చెల్లించాలి. – టీఎన్టీటీయూసీ డిమాండ్
.
బెల్లంపల్లి, జులై 8, (జనంసాక్షి )
సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలని టీఎన్టీటీయూసీ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
సింగరేణి సంస్థ 2022- 23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రను తానే తిరగారాసిందని, చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్ తో రు. 2222 కోట్ల నికర లాభాలను అర్జించి సరికొత్త రికార్డు సృష్టించిందని, ఇతర టాక్సుల రూపేణా చెల్లింపుల అనంతరం లాభాలను అర్థించిందని సింగరేణి యజమాన్యం బహిరంగ ప్రకటన చేయడం మంచిపరిణామం అని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా 30 వేల పై చిలుకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, భూగర్భ గనులలో ఓపెన్ కాస్ట్ లలో కాంట్రాక్ట్ కార్మికులు, పెర్మినెంట్ కార్మికులతో సమానంగా పని స్థలాల్లో ఉత్పత్తి తీయడంలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. సింగరేణి సంస్థ లాభాలు అర్ధించింది అంటే అది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ ఫలితమని వారికి కూడా లాభాలలో భాగస్వాములను చేయాలని, వారికి కూడా స్వీట్ డబ్బాలను పంపిణీ చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తీర్పు ఇచ్చినప్పటికీ, సింగరేణిలో అమలు చేయడం విమర్శించారు. జాతీయ సంఘాల మని చెప్పుకునే నాయకులు 11వ వేతన ఒప్పందంలో ఫస్ట్ కేటగిరి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందని చెప్పి మళ్లీ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలపై పోరాటాలకు పిలుపునిస్తూ వారి మైండ్ డైవర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ కార్మికులకు ముఖ్యమంత్రి కెసిఆర్ గత సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం ఇస్తామని ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాల జీవో అమలు చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు పెరుగుకపోగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంట్రాక్టు కార్మికులకు 26000 వేతనాలు తగ్గకుండా చెల్లించాలని, లేనియెడల అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు చేస్తామని, జిఎం కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో టీఎన్టీటీయూసీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, జీవరత్నం, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ఉపాధ్యక్షుడు గద్దల నారాయణ, డి చంద్రమౌళి, సిరకొండ కనకయ్య, కాసర్ల వెంకటేష్, భగవాన్ సింగ్, ఏ శంకరయ్య, బుల్లు మల్లయ్య, ఎండీ హసన్, హరికిషన్ పాండే, దూడపాక రవి, గోకర్ణ శేఖర్ పాల్గొన్నారు.