సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలి. – టీఎన్టీటీయూసీ ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్.
బెల్లంపల్లి, జులై 15, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎన్టీటీయూసీ ఆధ్వర్యంలో ఇంచార్జి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ రాజేశ్వర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా టీఎన్టీటీయూసీ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్ మాట్లాడుతూ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చిల్డ్రన్స్, ఆర్తో స్పెషలిస్టును నియమించాలన్నారు. జనరల్ ఫిజీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, గైకాలజిస్ట్ లను ఏర్పాటు చేయాలన్నారు. బెల్లంపల్లిలో సింగరేణి ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడిన పేషెంట్లను కార్పోరేట్ ఆసుపత్రికి రిఫర్ చేసే అధికారం బెల్లంపల్లి ఏసిఎంఓకు ఇవ్వాలన్నారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ, అబ్బాపూర్ వర్క్ షాప్, సిహెచ్పి, సివిల్ డిపార్ట్మెంట్ల లలో, శాంతిఖని గనితో పాటు ఓసీపీ గనులపై డీజీఎంఎస్ ఆదేశించిన ప్రకారంగా అంబులెన్సులను, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణిలో పని చేసి పదవి విరమణ పొందిన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు వారు పని చేసిన ఏరియాలో కాకుండా వారు నివాసముంటున్న, అందుబాటులో ఉన్న సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్య సౌకర్యం అందించాలన్నారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచి, బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలన్నారు. కరోనా సమయంలో 35 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కాంట్రాక్టు వైద్య సిబ్బందిని తొలగించి, పర్మినెంట్ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. పైడిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని, లేనిపక్షంలో సింగరేణి కాలరీ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి, సింగరేణి ఏరియా జిఎం ఆఫీసు ముందు, గనుల పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి వి రాములు, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎండి హసన్, నాయకులు బుల్లు మల్లయ్య, అంతరం శంకరయ్య, ఏ కుమార్, కాసర్ల వెంకటేష్ పాల్గొన్నారు