సిఎంతో ఆనందాన్ని పంచుకున్న నేతలు

అమరావతి,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కాకినాడ నగర పాలక ఎన్నికల్లో తెదేపా చరిత్రాత్మక విజయంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ గెలుపునకు కృషిచేసిన ప్రతిఒక్కరినీ సీఎం అభినందించారు.

ఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. సీఎం ఈ సందర్బంగా కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమానికి మంత్రులు కళా వెంకట్రావు, నారాయణ, ప్రత్తిపాటి, టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్‌, టీడీ జనార్ధన్‌, వీవీవీ చౌదరి పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటర్లు పట్టం కట్టారని మంత్రులు చెప్పుకొచ్చారు. పలువురు నేతలకు మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. కాకినాడ పురపాలక సంస్థలో మొత్తం 48 డివిజన్లకు గాను తెదేపా కూటమి (తెదేపా 32, భాజపా 3) స్థానాల్లో గెలుపొందగా, ప్రతిపక్ష వైకాపా నేతలు 10 స్థానాల్లో విజయం సాధించారు. ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. 30 ఏళ్ల తర్వాత తెదేపా కాకినాడ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది.

జగన్‌తో ప్రజలు విసిగిపోయారు:సోమిరెడ్డి

కాకినాడ పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం పట్ల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ ప్రవర్తన, అసెంబ్లీలో బాధ్యతారహితంగా మాట్లాడటం, ప్రతిపక్ష నేతగా నిర్మాణాత్మక పాత్ర పోషించలేకపోవడంతో ఆయన పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. జగన్‌కు రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని గుర్తుచేస్తూ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారన్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ పురపాలక ఎన్నికలే 2019 అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం అంటూ గతంలో జగన్‌ చేసిన వ్యాఖ్యల నుంచి వెనక్కి పోవద్దన్నారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబు పడిన కష్టాన్ని ప్రజలు గుర్తించి ఓటు రూపంలో విజయాన్ని అందించారని మంత్రి అన్నారు.

తాజావార్తలు