స్టేజీలలో ఆపకపోతే క్రమశిక్షణ చర్యలు
గుంటూరు: ఆర్టీసీలో నష్టాలను అధిగమించి, లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు తెలిపారు. గుంటూరు ఎన్‌టీఆర్ బస్టాండ్‌ను ఎండీ సోమవారం తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన జీతాలు, ఖర్చులకు అనుగుణంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్టేజీల వద్ద కండక్టర్లు తప్పనిసరిగా ప్రయాణికులను పిలిచి ఎక్కించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ సర్వీసులు ఖచ్చితమైన సమయపాలన పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. స్టేజీల వద్ద బస్సులు ఆపకపోతే సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు. డిపోల వారీగా లాభనష్టాలను అడిగి తెలుసుకున్నారు. లాభాలు పెంచుకోవటానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. బస్టాండ్‌లలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు తక్కువ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఈడీ వెంకటేశ్వరరావు, గుంటూరు, పశ్చిమగోదావరి ఆర్‌ఎంలు జ్ఞానంగారి శ్రీహరి, ధనుంజయరావు, డిప్యూటీ సీటీఎంలు వాణిశ్రీ, వెంకటేశ్వరరావు, మురళీకృష్ణ, డిప్యూటీ సీఎంఈలు శరత్‌బాబు, గంగాధర్, పలువురు డిపో మేనేజర్లు పాల్గొన్నారు.