స్వర్ణ పతక విజేత రాహుల్‌కు ఘనస్వాగతం

– స్వాగతం పలికిన క్రీడాశాఖమంత్రి, ఇతర అధికారులు
– రాష్టాన్రికి బంగారు పతకం సాధించటం సంతోషంగా ఉంది
– ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తా
– స్వర్ణ పతక విజేత రాహుల్‌
విజయవాడ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): కామన్వెల్త్‌ గేమ్స్‌ వెయిట్‌ లిప్టింగ్‌ విభాగంలో బంగారు పతకం సాధించి స్వదేశానికి తిరిగివచ్చిన రాహుల్‌కి గన్నవరం విమానశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో గన్నవరం చేరుకున్న రాహుల్‌కి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాప్‌ వీసీ బంగార్రాజు , ఛైర్మన్‌ అంకమ్మచౌదరి, పలు క్రీడా సంఘాల సభ్యులు, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. దేశంలోనే నేరాలకు చరిత్ర కలిగిన సువర్టపురంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశ కీర్తీ ప్రతిష్టలు ఇనుమడింపజేయటం సామాన్య విషయం కాదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా చాటిచెప్పిన రాహుల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తరుపున రాహుల్‌కు నగదు పురస్కారం ప్రకటించినట్లు తెలిపారు. రాష్టాన్రికి బంగారు పతకం సాధించటం సంతోషంగా ఉందని… ఇదే స్ఫూర్తితో దేశానికి మరిన్ని పతకాలు సాధిస్తానని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబును కలిసిన రాహుల్‌..
కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ రాగాల వెంకట రాహుల్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించినందుకు గాను రాహుల్‌ను చంద్రబాబు అభినందించారు. అలాగే రాహుల్‌కు సన్మాన సభ ఏర్పాటు చేయాల్సిందిగా క్రీడాశాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

తాజావార్తలు