స్వాతంత్య్ర పోరాటంలో రైల్వేలు కీలకపాత్ర డీఆర్‌ఎం అశోక్‌కుమార్‌

విజయవాడ, రైల్వే స్టేషన్‌: స్వాతంత్య్ర పోరాటంలో భారతీయ రైల్వేలు కీలకమైన పాత్ర పోషించి, ప్రజాసేవకు అంకితమైన సంస్థగా గుర్తింపు పొందాయని విజయవాడ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రైల్వే మినీ స్టేడియంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డీఆర్‌యం అశోక్‌కుమార్‌ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ పీకే సక్సేనా పంపించిన సందేశాన్ని వినిపించారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటంలో రైల్వేలు ఎల్లవేళలా ముందుంటాయన్నారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించామన్నారు. పుష్కరాల కోసం 832 ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. రైల్వేలు అత్యున్నత ఫలితాలు సాధించటంలో కార్మికుల పాత్ర ఎనలేనిదని ఆయన కొనియాడారు. రైల్వే మహిళా సంక్షేమ సంఘాలు కేవలం రైల్వే కుటుంబాలకే కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ఆయన ప్రశంసించారు. రైల్వే పాఠశాల, జాక్‌ అండ్‌ జిల్‌ పాఠశాల విద్యార్థులు రూపొందించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకలో ఏడీఆర్‌యం ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌, సీనియర్‌ డీసీయం ఎన్‌.సత్యనారాయణ, సీనియర్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఎస్‌.గాంధీ ఇతర అధికారులు, మహిళా, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు

 

తాజావార్తలు