స్వాతంత్య్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన తిలక్‌

ముంబై,జూలై23(జనంసాక్షి): లోకమాన్య తిలక్‌.. స్వాతంత్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రదాత. 1856, జులై 23 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గాంధీజీ దృష్టిలో ఆయన ’ఆధునిక భారత నిర్మాత! నెహ్రూకాయన ` ’భారత విప్లవ పిత!’ అహింసతో మహాత్ముడు బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తే… ’ఆలోచన’తో భారతీయులను తట్టిలేపి, తెల్లవారి గుండెల్లో కల్లోలం సృష్టించి… భారతావని నుదిటిన స్వరాజ్య ’హక్కు’ తిలకం దిద్దిన బుద్ధిజీవి… బాల గంగాధర్‌ తిలక్‌! మనం ఈరోజు వింటున్న ఆత్మనిర్భర్‌, మేకిన్‌ ఇండియాను వందేళ్ల కిందటే ఆకాంక్షించిన ఆ దార్శనికుడి 166వ జయంతి నేడు! స్వాతంత్య్ర అమృతోత్సవాల ముంగిట… అలనాటి పోరాట యోధుడికి ఓ నివాళి!ఒక్కటి కాదు… ఆయనో తత్వవేత్త, గణితవేత్త, జర్నలిస్టు, రచయిత.. ఉద్యమకారుడు. తిలక్‌ దృష్టిలో స్వరాజ్యమంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం ఒక్కటే కాదు. సాంస్కృతిక, ఆర్థిక స్వాతంత్య్రం కూడా! సంస్కృతి, విద్య, విూడియా… మూడిరటినీ మార్గాలుగా చేసుకొని ప్రజల్ని చైతన్యవంతులను చేయటానికి, భారత జాతీయ అస్థిత్వాన్ని పాదుకొల్పటానికి కృషి చేశారు తిలక్‌. ఆత్మనిర్భర్‌ భారత్‌… నైపుణ్య భారత్‌, మేకిన్‌ ఇండియా…అంటూ ఇప్పుడు మనం ప్రతిరోజూ వినే ఈ పదాల్ని వందేళ్ళ కిందటే మంత్రించారు తిలక్‌!తన స్వదేశీ అర్థం కేవలం విదేశీ వస్తువులను బాయ్‌కాట్‌ చేయటమే కాదు… దేశీయంగా మనవాళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారాలని, భారత్‌లో తయారీ రంగం విస్తరించాలని కోరుకునేవారు. ఆయనిచ్చిన ఈ స్ఫూర్తితోనే ఈశ్వర్‌దాస్‌ వర్ష్‌ణెళి పుణె దగ్గర గ్లాస్‌వర్క్స్‌ ఫ్యాక్టరీ ఆరంభించారు. ముంబైలో జంషెడ్‌జీ టాటాతో కలసి తిలక్‌ బొంబాయి స్వదేశీ సహకార స్టోర్స్‌ కంపెనీ మొదలెట్టారు. భారత్‌లో తయారయ్యే వస్తువులను ప్రోత్సహించటం ఈ కంపెనీ ప్రధాన కర్తవ్యం. ట్యుటికోరిన్‌లో చిదంబరం పిళ్ళై షిప్పింగ్‌ కంపెనీ తెరిచారు. బ్రిటిష్‌ ఇండియా స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీకి అది తీవ్రమైన పోటీనిచ్చింది. చివరకు… మాండలే జైలులో ఉన్నప్పుడు రాసిన గీతారహస్య పుస్తకం అచ్చువేసేందుకు భారత్‌లో తయారైన కాగితాన్నే వాడాలని పట్టుబట్టారు. స్వాతంతో్యద్యమంలో ఆయన వినాయక ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించి స్వాతంతో్యద్యమ కాంక్షను రగిలించారు.