15న ప్రతిభా పురస్కారాల ప్రదానం
విజయవాడ,అక్టోబర్12(జనంసాక్షి): రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాలు నెల 15న ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఏర్పాట్లు 13వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. మానవ వనరుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. 2017 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 6600 మందికి పురస్కారాలు అందజేస్తారు. పదో తరగతిలో 4 వేల మంది, ఇంటర్మీడియట్‌లో 600 మంది, డిగ్రీ, పిజి కోర్సులలో 2 వేల మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నామని తెలిపారు. సుమారు 12 వేల మంది విద్యార్థులు హాజరుకానున్న దృష్ట్యా ఏర్పాట్లు అందుకు తగ్గట్లుగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అత్యవసర మందులతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖాధికాకి సూచించారు. నగరపాలక సంస్థ శానిటేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, అధికారులు త్రాగునీటిని, ఆర్‌అండ్‌బి అధికారులు బారికేడింగ్, అగ్నిమాపక శకటాలతో ఫైర్ సర్వీసు అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.