15వ ఆర్థిక సంఘంతో రాష్ట్రాలు కుదేలు

రైతులకు తీరని నష్టం జరుగుతోందని వ్యాఖ్య
ఆర్థిక మంత్రుల భేటీలో పలువురు మంత్రుల వ్యాఖ్యలు
అమరావతి,మే7(జ‌నం సాక్షి):  15 ఆర్థికసంఘం రాష్ట్రాలను ను భిక్షగాళ్లను చేస్తోందని కేరళ ఆర్థికమంత్రి థామస్‌ ఇసాక్‌ మండిపడ్డారు. చెరకు రైతులపై ప్రేమ చూపినట్టే… రబ్బర్‌, కాటన్‌ రైతులపై కేంద్రం ఎందుకు ప్రేమ చూపడం లేదని దుయ్యబట్టారు. పొలిటికల్‌ మైలేజీ కోసమే కేంద్రం ఇదంతా చేస్తోందని ఆయన ఆరోపించారు. 15 ఆర్థికసంఘం సిఫార్సుల వల్ల తమిళనాడు రూ. 10 వేల కోట్లు… ఆంధ్రప్రదేశ్‌ రూ. 8వేల కోట్లు నష్టపోతాయని ఇసాక్‌ వెల్లడించారు. ఏపీ డిమాండ్లలో నిజాయితీ ఉందని, ఏపీ ఆర్థిక లోటు భర్తీ చేస్తామంటే ఇతర రాష్ట్రాలకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. సమావేశం తర్వాత రాష్ట్రపతికి మెమోరాండం పంపుతామని ఇసాక్‌ తెలిపారు. కేరళలో నిర్వహించిన తొలి సమావేశానికి నాలుగు రాష్టాల్రు మద్దతే లభించిందని.. ఈ సమావేశానికి మద్దతిచ్చే రాష్ట్రాల  సంఖ్య పెరిగిందని కేరళ మంత్రి థామస్‌ ఐసాక్‌ అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య భవిష్యత్తులో పదికి పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్‌ఆర్బీఎంను 1.7 శాతానికి కుదించే ఆలోచనలో కేంద్రం ఉందన్నారు. రెవెన్యూ డివల్యూషరన్‌ను 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తామంటే కొన్ని రాష్టాల్రకు ఇబ్బందేనని థామస్‌ ఐసాక్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని పశ్చిమబంగా ఆర్ధిక మంత్రి అమిత్‌ మిత్ర అన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు ఛాలెంజ్‌గా తీసుకున్నారని.. ఐటీ రంగంలో చంద్రబాబు ఎటువంటి కృషి చేశారో అందరికీ తెలుసునన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 15వ ఆర్ధిక సంఘం ద్వారానే కాదు.. వివిధ రూపాల్లో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ప్రజాకర్షక పథకాలకు నిధుల కోత పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తోన్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాల్సి ఉందని అమిత్‌ మిత్ర అన్నారు. పంజాబ్‌ రాష్ట్రానికి  కేంద్రం నుంచి కేవలం 29 శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని.. కొన్ని రాష్ట్రాలకు కేంద్రం వాటా ఎక్కువగా వెళ్తోందని పంజాబ్‌ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిగా విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందని
అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలు మార్చాల్సిందేనని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి అన్నారు. దీనివల్ల రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు నెరవేర్చడానికి ఇబ్బందులు కలిగించేలా విధి విధానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎక్సైజ్‌, కమర్షియల్‌ టాక్సులే పుదుచ్చేరికి ప్రధాన ఆదాయమని.. కానీ వీటిని భర్తీ చేయడానికి కేంద్రం అంగీకరించడం లేదన్నారు.
చిన్న రాష్ట్రాలకు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలు ఇబ్బందికరంగా ఉన్నాయని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారు. కేరళలో జరిగిన ఆర్ధిక మంత్రుల సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

తాజావార్తలు