18న దళిత మిలీనియమ్ మార్చ్
గుంటూరు,మే2( జనం సాక్షి): దళితులకు రక్షణ కవచంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ ఈనెల 18న గుంటూరు నుంచి మంగళగిరి వరకు ‘దళిత మిలీనియమ్ మార్చ్’ నిర్వహించనున్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, కేంద్ర మంత్రి చింతా మోహన్‌ల ఆద్వర్యంలో దీనిని చేపట్టనున్నారు. ఈ మేరకు అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. మార్చి 20న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పును నిరసిస్తూ, ఏప్రిల్ 2న భారత్‌బంద్ చేపట్టగా దేశవ్యాప్తంగా 11 మంది అమరులయ్యారు. రాష్ట్రంలో దళిత గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలన్నారు. అనంత జిల్లాలో ఇప్పటికీ అంటరానితనం, కుల వివక్షత, రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతోందన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చేపడుతున్న మిలినియమ్ మార్చ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.