22న వెంకయ్య నాయుడు రాక
ఏర్పాట్లను సవిూక్షించిన కలెక్టర్
అమరావతి,మే11(జనం సాక్షి ): ఈ నెల 22న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి వెంకయ్య రానున్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు, రెవెన్యూ, పోలీసు, ఫైర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశ మయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆ రోజు ఉదయం 10 గంటలకు నూజివీడు డివిజన్ గన్నవరం మండలం కొండపావులూరు వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి భూమి పూజ చేస్తారన్నారు. రూ 36.76 కోట్ల వ్యయంతో సదరన్ క్యాంపస్ ఆఫ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డిజాస్టర్ మేనేజ్‌మెంటు కార్యాలయం ఏర్పాటు చేస్తారన్నారు. తర్వాత వెంకయ్య నాయుడు ఆత్కూర్ స్వర్ణభారతి ట్రస్టు నుంచి బయలుదేరుతారని పేర్కొన్నారు. కొండపావులూరు వద్ద బీటీ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రధాన డయాస్‌పై సీటింగ్ అరేంజ్‌మెంటు బ్యాక్ డ్రాప్ సిద్ధం చేయాలని సూచించారు.