27నుంచి జాతీయ వాలీబాల్ పోటీలు
ఏలూరు,అక్టోబర్12(జనంసాక్షి): ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు జిల్లాలోని నల్లజర్లలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు జరుగునున్నాయి. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో వివిధ ప్రాంతాల క్రీడాకారులు పాల్గొంటారు. జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరపున ఆడే జట్టులో జంగారెడ్డిగూడెంనుంచి ఎన్నికైన విద్యార్థులు కూడా పాల్గొంటారు.ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన టి.దేవి, టి.మౌనికారాణి, ఎం.అనూష అండర్-17 విభాగంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బుట్టాయగూడెం రెడ్డిగణపవరం స్కూల్‌లో వీరు శిక్షణ పొందారు. ఇదిలావుంటే జాతీయస్థాయి పోటీలకు దేవరపల్లిలోని భూపతిరాజు విద్యా సంస్థల కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్, ఫుట్‌బాల్, సెపక్‌తక్రా పోటీల్లో కళాశాలకు చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపారు. ఫుట్‌బాల్‌లో ప్రథమ స్థానం, సెపక్‌తక్రాలో వరుసగా రెండోఏట ప్రథమస్థానం, మహిళా క్రికెట్‌లో వరుసగా నాలుగో ఏట ప్రథమస్థానం సాధించారు. అండర్- 19 బాలికల ఫుట్‌బాల్ రాష్ట్ర జట్టుకు పి.పద్మజ, బాలుర జట్టుకు పి.వంశీ కేశవ, అండర్-17 బాలుర రాష్ట్ర జట్టుకు ఇ.సంతోష్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే మహిళా క్రికెట్ జట్టుకు ఈలపోలు తేజస్విని, ఉప్పలపాటి సంధ్య, తంగెళ్ల భవాని, తంగెళ్ల సౌజన్య, జాతీయ స్థాయి సెపక్‌తక్రా పోటీలకు సిహెచ్.సతీష్, ఎల్.గణపతి, టేబుల్‌టెన్నిస్ జాతీయ స్థాయి పోటీలకు ఎం.చంటిబాబు, ఎం.హరికృష్ణప్రశాంత్ ఎంపిక అయ్యారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు, వారికి శిక్షణ ఇస్తున్న క్రీడల అధ్యాపకుడు యాజమాన్యం అభినందించింది.