4 కొత్త గనుల నుండి 100 లక్షల టన్నుల బొగ్గు.
……4 కొత్త గనుల నుండి 100 లక్షల టన్నుల బొగ్గు…….గనుల వారీగా పనులపై చర్చించిన సంస్థ చైర్మన్,ఎం.డి ఎన్. శ్రీధర్….అనుమతుల సాధనకు, బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి కాల పరిమితుల సూచన…………..సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 4 కొత్త ఓపెన్ కాస్ట్ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుంది. అలాగే రానున్న 3 సంవత్సరాల్లో ప్రారంభించాల్సిన 13 కొత్త గనులపై కూడా సంస్థ ఛైర్మన్ మరియు ఎం.డి. ఎన్. శ్రీధర్ హైదరాబాద్ సింగరేణి భవన్‌లో మంగళవారం నాడు సంబంధిత అధికారులతో ఒక ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు, ప్రాజెక్టు ప్లానింగ్ జనరల్ మేనేజర్లు కొత్త గనులు ప్రారంభించవలసి ఉన్న ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
రానున్న మూడు సంవత్సరాల్లో మొత్తం 13 కొత్త గనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటికే దాదాపు అన్ని అనుమతులు లభించిన నాలుగు కొత్త గనులపైన, ఆ గనుల నుంచి ఉత్పత్తి చేయాల్సిన బొగ్గు, రవాణా తదితర అంశాలపైన సంస్థ ఛైర్మన్ ప్రధానంగా చర్చించారు. ఈ నాలుగు గనులకు ఇంకా మిగిలి ఉన్న ఒకటి రెండు అనుమతులను త్వరగా సాధించాలని, నిర్దేశించుకున్న సమయానికి గనులు ప్రారంభించాలని ఆయన కాలపరిమితులు సూచించారు.
ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాకు:
ఏడాదికి కోటి టన్నుల నాణ్యమైన బొగ్గును అందించే ఈ బ్లాక్‌కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి. చివరిగా బొగ్గు గని ప్రాంతంలో ఉన్న కొన్ని చెట్లను ఆ రాష్ట్ర అటవీ శాఖ వారు తొలగించే పని ఒక్కటే మిగిలి ఉంది. రానున్న మూడు నెలల్లో ఈ పని పూర్తయితే బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తారు. కాగా బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను యాజమాన్యం ఇప్పటికే పూర్తి చేసింది. సింగరేణి ఉన్నతాధికారులు త్వరలోనే ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడి ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర అటవీశాఖ వారితో సంప్రదించాలని నిర్ణయించారు. ఈ ఏడాది కనీసం 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరపాలని, తర్వాతి సంవత్సరాల్లో ఏడాదికి 10 నుండి 15 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు.
వీకే ఓపెన్ కాస్ట్ (కొత్తగూడెం):
ఏడాదికి 53 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం గల ఈ గని నుండి ఈ తొలి ఏడాది మాత్రం 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. గతంలో ఉన్న వి.కె-7 భూగర్భ గనినే ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి అటవీ భూమికి రాష్ట్ర అటవీశాఖ నుండి అనుమతి అవసరమై ఉంది. ఇప్పటికే సంబంధిత అటవీశాఖ అధికారులు స్థల పరిశీలన చేసి నివేదికను ఉన్నత అధికారులు సమర్పించారు. త్వరలో న్యూఢిల్లీలో జరిగే ఒక ఉన్నతస్థాయి అటవీ శాఖ సమావేశంలో దీనికి అనుమతి లభించనున్నది. ఈ అనుమతి లభించిన వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి యాజమాన్యం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది.
గోలేటి ఓపెన్ కాస్ట్ (బెల్లంపల్లి):
గతంలో గోలేటి భూగర్భ గనిగా ఉన్న ఈ ప్రాంతంలో ఏడాదికి 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం గల ఓపెన్ కాస్ట్ గని ప్రారంభిస్తున్నారు. ఈ గనికి సంబంధించి పలు అనుమతులు ఇప్పటికే లభించినప్పటికీ ఇంకా కొన్ని అనుమతులు సాధించవలసి ఉన్నది. ఇవి కూడా లభిస్తే ఈ ఏడాది ఇక్కడి నుండి కనీసం 5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులు మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సంస్థ ఛైర్మన్ ఆదేశించారు.
జె.కె. ఓపెన్ కాస్ట్ మైన్ (ఇల్లందు):
గతంలో ఇక్కడ నిర్వహించిన 21 ఇంక్లైన్ గని, కొంత జె.కె-5 ఓసి గనికి సంబంధించిన ప్రాంతాన్ని కలుపుతూ ఏడాదికి 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ కొత్త గనికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఉత్పత్తి తొలి సంవత్సరం కనుక ఇక్కడ నుండి కనీసం 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలో ఇంకా మిగిలి ఉన్న అనుమతులను వెంటనే సాధించాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎం.డి. ఎన్. శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ నాలుగు గనుల నుండి ఈ ఏడాది సుమారు 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దీనితో సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సుసాధ్యం కానున్నదని సంస్థ ఛైర్మన్ ఎన్. శ్రీధర్ అధికారులకు తెలియజేశారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎన్. బలరామ్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్), డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు, ఎన్.వి.కె. శ్రీనివాస్ (ఆపరేషన్స్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె. ఆల్విన్, అడ్వైజర్ సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేష్, జీఎం (సీపీపీ) సి.హెచ్. నరసింహారావు, జి.ఎం (మార్కెటింగ్ ) కె. సూర్యనారాయణ, జీఎం (పీపీ) కె. కొండయ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలు, కొత్తగూడెం కార్పొరేట్ నుంచి వివిధ విభాగాల జీఎంలు పాల్గొన్నారు.