కాంగ్రెస్ పార్టీ విధానం మాదిగలకు అనుకూలం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 14 (జనం సాక్షి) : కాంగ్రెస్ పార్టీ విధానం మాదిగలకు అనుకూలం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారని, మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేసామని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించిందని, సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా మేం స్పష్టంగా ప్రకటించామన్నారు. తెలంగాణ సమస్యలా ఈ సమస్య జఠిలం అయిందని, కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మీ వాదనలో బలం ఉంది.. మీకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉందని, న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం వేసామని సీఎ రేవంత్ రెడ్డి తెలిపారు.