8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరిసారి


బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌
ముంబై,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 రెండో దశకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని, 8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరి సారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ అన్నారు. వచ్చే సీజన్‌ నుంచి 10 జట్లు పోటీలో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక యూఏఈ వేదికగా జరిగే మలిదశ మ్యాచ్‌లకు అభిమానులను అనుమతించేందుకు కృష్టి చేస్తున్నామన్నారు. ఫ్యాన్స్‌ అనుమతికి యూఏఈ ప్రభుత్వం అనుమతి కావాలని, ఆ పనుల్లోనే ఉన్నామని చెప్పాడు. తాజాగా ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ లీగ్‌కు సంబంధించిన అనేక విషయాలను ఆయన చెప్పారు. ‘ఐపీఎల్‌ సెకండాఫ్‌ మ్యాచ్‌లకు అభిమానులను అనుమతించే విషయంపై ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవడంతో పాటు యూఏఈ ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి! ఒకవేళ అనుమతిస్తే అటు ఆటగాళ్లు, ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారి భద్రతే అత్యంత ముఖ్యం. మిగతాదంతా యూఏఈ ప్రభుత్వంపై ఆధారపడి ఉంది’ అని అరుణ్‌ ధుమాల్‌ అన్నారు. పది జట్ల ఐపీఎల్‌ గురించీ ధుమాల్‌ మాట్లాడారు. ‘ఇప్పుడందరి చూపూ ఐపీఎల్‌ మీదే ఉంది. యూఏఈలో ఐపీఎల్‌ విజయవంతం అవుతుందని నమ్ముతున్నాం. ఏదేమైనా ఎనిమిది జట్లతో ఇదే చివరి సీజన్‌. వచ్చేసారి 10 జట్లు ఉంటాయి. మేం దానిపైనా ఫోకస్‌ పెట్టాం. జట్ల బిడ్‌ దాఖలు, మెగా వేలం ఏర్పాట్లపై కసరత్తులు చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. గతంలోనూ లీగ్‌లో పది జట్లు ఉన్న సంగతి తెలిసిందే. 2011లో 10 జట్లతో లీగ్‌ నిర్వహించారు. 2012, 13లో తొమ్మిది జట్లు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ ఎనిమిది జట్లకు పరిమితమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో మేగా వేలం జరిగే అవకాశం ఉంది. ఇక కొత్త ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు, స్టార్‌ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ కనీస విలువ రూ.2000 కోట్లుగా ఉండొచ్చని ఐపీఎల్‌ వర్గాల సమాచారం. రెండు కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి ఐపీఎల్‌ 2022 టెండర్‌ పత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. అక్టోబర్‌ మధ్యలో బిడ్ల (ప్రాంచైజీలను) ఆహ్వానం, డిసెంబర్‌ మాసంలో మెగా యాక్షన్‌ జరగనుంది. ఇక జనవరి 2022లో మీడియా హక్కులు బీసీసీఐ ఇవ్వనుంది. ఐపీఎల్‌ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయేందుకు ఆస్కారం ఉంది. అలాంటప్పుడు ఫ్రాంచైజీల విలువ గరిష్ఠంగా 50% పెరుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లనే రిటైన్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు భారతీయులు మరియు 1 విదేశీ ప్లేయర్‌.. లేదా ఇద్దరు భారతీయులు మరియు ఇద్దరు విదేశీలు ఉండే అవకాశం ఉంది. ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు.. ఒక్కరినే తీసుకుంటే రూ.12.5 కోట్లు ఇవ్వాలి. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 2021 మలిదశ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్స్‌ దుబాయ్‌ చేరి ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టాయి.