9న ఫుడ్‌సేఫ్టీ కమిషన్ పర్యటన
ఏలూరు,నవంబర్6(జనంసాక్షి): మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్‌షాపుల దుకాణాలను పరిశీలించేందుకు ఎపి స్టేట్ ఫుడ్ కమిషన్ ఈ నెల తొమ్మిదో తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఎంహెచ్.షరీఫ్ తెలిపారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు గైడ్‌లైన్స్ ప్రకారం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారా.. లేదా అనేది తెలుసుకునేందుకు వీరు వస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదిన జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో ఫుడ్ కమిషన్ పర్యటన ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల్లోపు ప్రజల నుండి ఫిర్యాదులను కమిషన్ స్వీకరిస్తుందని చెప్పారు. ఫుడ్ యాక్టుపై ప్రధానోపాధ్యాయులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. రేషన్‌షాపులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించే బియ్యం, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువులు నాణ్యమైనవి ఉండాలన్నారు. బియ్యం,
కందిపప్పు తదితర నిత్యావసర సరుకుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులు, సంబంధిత షాపు నిర్వాహకులపై ఫుడ్ సెక్యూరిటీ యాక్డు కింద కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.