ఒంగోలు, కందుకూరు పట్టణం: ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలేటివారిపాలెం మండలం వై.చర్లో పాలెం వద్ద శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు, పెళ్లి బృందం ప్రయాణిస్తున్న మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15మంది మృతి చెందగా, మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు బస్సు పామూరు నుంచి కందుకూరు వైపు వస్తుండగా, కందుకూరు నుంచి మాలకొండ వైపు వెళ్తున్న మినీ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు వాహనాలు వేగంగా ఢీకొని పక్కనే ఉన్న కాల్వలో బోల్తాపడ్డాయి. అనంతరం మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 12మందిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మరో ఆరుగురికి కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మినీ లారీలో 40 మంది ఉండగా, ప్రైవేటు బస్సులో డ్రైవర్ మినహా ప్రయాణికులెవరూ లేరు. బాధితులంతా ప్రకాశం జిల్లా చేవూరు నుంచి మాలకొండ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మృతుల వివరాలు
మృతుల్లో తోడేటి చిరంజీవి, తోడేటి ప్రసాద్, నక్కల సుభాషిణి, రాయుని సుబ్బయ్య, కొల్లి సుశీల, సన్నెబోయిన శ్రీలేఖ, సన్నెబోయిన చందు, సన్నెబోయిన ఆదినారాయణ, సమాతి రంగయ్య, మోటుపల్లి పద్మ, బూపాడు హజరతయ్య, సింగమనేని వెంకటేశ్వర్లు, సమాతి నాగమ్మ, సన్నెబోయిన రాజమ్మ ఉన్నారు. వీరిలో ముగ్గురు పిల్లలు శ్రీలేఖ, చందు, ఆదినారాయణ నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సన్నెబోయిన రాజమ్మ నెల్లూరు జిల్లా కావలి మండలం మామిడిదరువు గ్రామానికి చెందినవారు కాగా హజరతయ్య నెల్లూరు జిల్లా గోగులపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మిగిలిన వారంతా చేవూరు గ్రామానికి చెందిన వారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలిస్తామని ఏఎస్పీ రామానాయక్ తెలిపారు.
తాజావార్తలు
- నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకువెళ్తారు జాగ్రత్త!
- నేడు జార్ఖండ్ తొలిదశ పోలింగ్
- దాడిఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు
- అబద్దాల ప్రచారం,వాట్సాప్ యునివర్సీటీకి కాలం చెల్లింది
- నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్..
- భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు ప్రమోషన్..!!
- 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు- ఎల్లో అలర్ట్..!!
- మాజీమంత్రి కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ పైర్
- రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
- మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జయంతి ఉత్సవాలను తెలంగాణలో భవన్ లో నిర్వహించటం సంతోషంగా ఉంది
- మరిన్ని వార్తలు