అజ్ఞాతం వీడిన బీహార్‌ మాజీమంత్రి

కోర్టులో లొంగిపోయిన మంజువర్మ

సుప్రీం ఆదేశాలతో ఫలించిన పోలీసుల యత్నాలు

పాట్నా,నవంబర్‌20(జ‌నంసాక్షి): వారం రోజుల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బీహార్‌ మాజీ మంత్రి మంజు వర్మ ఎట్టకేలకు కోర్టు ముందు లొంగిపోయారు. ఇంతకాలం ఆమె తప్పించుకుఇన అజ్ఞాతంలో ఉన్నారు. సుప్రీం ఆదేశాలతో పోలీసులు గాలింపు చేపట్టడంతో కోర్టులో లొంగిపోయారు. అక్రమ ఆయుధాల చట్టం కేసులో మంజువర్మ నిందితురాలిగా ఉన్నారు. ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ ¬ం అత్యాచారం కేసులో విచారిస్తున్న సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను ఆయుధ చట్టం కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేయలేకపోవడంపై సుప్రీంకోర్టు గతవారం బీహార్‌ పోలీసులకు మొట్టికాయలు వేసింది. మంత్రిగా పనిచేసిన ఓ ప్రముఖ వ్యక్తి నెలరోజుల నుంచి ఎక్కడున్నారో కూడా తెలియకుండా బీహార్‌ పోలీసులు ఉన్నారా?అంటూ విస్మయం వ్యక్తం చేసింది. ఆమె ఎక్కడున్నారో గుర్తించి అరెస్ట్‌ చేయలేని పక్షంలో ఈ నెల 27న బీహార్‌ డీజీపీ తమ ముందు హాజరు కావాలంటూ సుప్రీం హుకుం జారీచేసింది. ఈ నేపథ్యంలోనే మంజు వర్మ మంగళవారం బెగుసరాయ్‌ కోర్టు ముందు లొంగిపోవడం గమనార్హం. ఆమె చంద్రశేఖర వర్మ గత నెల 29నే కోర్టు ముందు లొంగిపోయారు. ముజఫర్‌పూర్‌ ¬ం అత్యాచారాల కేసులో ప్రధాన నిందితుడు బ్రజేష్‌ ఠాగూర్‌తో చంద్రశేఖర్‌ వర్మకు సన్నిహిత సంబంధాలున్నట్టు వార్తలు రావడంతో… బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మంజు వర్మను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆమె పార్టీ ప్రాధమిక సభ్యుత్వాన్ని కూడా రద్దు చేస్తూ అధికార జేడీయూ పార్టీ ఇటీవల నిర్ణయం తీసుకుంది.