అత్తాపూర్‌లో దారుణ హత్య

– నడిరోడ్డుపై వ్యక్తిని గొడ్డలితో నరికిన దుండుగులు
– పాతకక్షల నేపథ్యంలోనే హత్య
– నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– నడిరోడ్డుపై హత్య ఘటనతో ఉలిక్కిపడ్డ స్థానిక ప్రజలు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నగర శివారు రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సిద్ధిఅంబర్‌ బజార్‌కు చెందిన రమేశ్‌ (35) అనే వ్యక్తి ఓ హత్య కేసులో ఉప్పరపల్లి కోర్టుకు బుధవారం హాజరయ్యాడు. అతను తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు. దీంతో వారి నుంచి తప్పించుకోవడానికి రమేశ్‌ ఆటో దిగి పరుగెత్తాడు. అత్తాపూర్‌ 143 పిల్లర్‌ వద్ద బస్టాప్‌లో అతన్ని పట్టుకున్న దుండగులు నడిరోడ్డుపైనే గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా దుండగులు ఆగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి కూడా దుండగులు భయపడలేదు. అతను చనిపోయేంత వరకూ గొడ్డలితో దాడి చేస్తూనే ఉన్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతీకార హత్యే..
తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కక్షతో రమేశ్‌ ఆరు నెలల క్రితం మహేశ్‌ అనే యువకుడిని శంషాబాద్‌లో హత్య చేశాడు. ఆ కేసులో అరెస్టయి అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ కేసు విచారణలో భాగంగానే రమేశ్‌  బుధవారం ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హాజరయ్యాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మహేశ్‌ తండ్రి, బంధువు అదనుచూసి రమేశ్‌ను హత్య చేశారు. గతవారం ఎర్రగడ్డలో కుమార్తె, అల్లుడిపై ఓ వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో దాడి చేసిన సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరిచిపోకముందే బుధవారం అత్తాపూర్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. వరుస ఘటనలతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
హత్యకు గురైన వ్యక్తి ఓ కేసులో ఏ-1 ముద్దాయి – సీఐ
హత్యకు గురైన సమాచారం అందుకున్న సీఐ సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సవిూక్షించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. హత్యకు గురైన రమేష్‌ గౌడ్‌ గతంలో మహేష్‌ గౌడ్‌ హత్యకేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్నాడని, ఆ కేసుకు సంబంధించి బుధవారం ఉప్పరపల్లి కోర్టుకు హాజరయి.. తిరిగి వెళుతుండగా మహేష్‌కు సంబంధించినవారు రమేష్‌ను అనుసరించి పిల్లర్‌ నెం. 139
దగ్గర గొడ్డలితో నరికి చంపారని సీఐ తెలిపారు. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.