ఎన్నికల విధుల్లో అధికారులు

అక్రమార్కుల పంటపండిస్తున్న ఇసుక

నిజామాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎన్నికల సీజన్‌ కావడంతో అధికారులు బిజీగా ఉండడంతో ఇదే అదనుగా ఇసుకాసురుఉల తమ పనికానిస్తున్నారు. ఎక్కడిక్కడ మెల్లగా రవాణా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని నిరోధించాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో వీరి పంటపండుతోంది. వాగులను పిండి మరీ తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. . దాదాపు ఐదారు విూటర్ల లోతు వరకు ఇసుకను తీయడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో వాగులు, నదుల తీర ప్రాంత ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడనుంది. ఇసుక వ్యాపారం జోరుగా జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవడంలో చూసీచూడనట్లు ఉంటున్నారు. ఇసుక దోపిడీ జరుగుతున్నా అధికారులు నామమాత్రంగా అపరాధ రుసుం విధించి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో

అర్ధరాత్రిళ్లు సైతం ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లాలోని వాగులు, నదులకు తీర ప్రాంతాలుగా ఉన్న కొన్ని గ్రామాల్లో ఇసుకను తరలించడానికి బహిరంగంగా అనధికార టెండర్లను సైతం నిర్వహిస్తున్నారు. వాహనాల రాకపోకలకు ప్రత్యేకంగా రహదారులను ఏర్పాటు చేసుకున్నారు. నీటి సంరక్షణ కోసం రూపొందించిన వాల్టా చట్టం అమలుకు తూట్లు పొడుస్తున్నారు.పెద్ద ఎత్తున తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో వాగులో ఉన్న ఇసుకను విక్రయించేందుకు అనధికార టెండర్లు

నిర్వహిస్తున్నారు. దీన్ని దక్కించుకున్న గుత్తేదారులు పగలు, రాత్రి తేడా లేకుండా కొల్లగొడుతున్నారు. స్థానికంగా ఉన్న వాగులో నుంచే యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎంత నష్టం వాటిల్లుతుందో అర్థం చేసుకోవచ్చు. పలు గ్రామాల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాగు, నదీ తీర ప్రాంతాల్లో ట్రాక్టరుకు రూ.200 చొప్పున చెల్లించి తీసుకెళ్లడం ద్వారా కొన్ని గ్రామాల్లో అభ్యంతరం చెప్పడం లేదు.

అక్రమార్కులు కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారంపై అధికారులు దృష్టి సారించడం లేదని గుర్తించి మరీ రవాణా చేస్తున్నారు.